Share News

బీ ఫామ్‌ల పంపిణీలో బాహాబాహీ

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:33 AM

మునిసిపల్‌ ఎన్నికల వేళ కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మంగళవారం బీ ఫామ్‌ల పంపిణీ సందర్భంగా...

బీ ఫామ్‌ల పంపిణీలో బాహాబాహీ

  • ఆమనగల్లు బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వర్గ పోరు.. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌పై మండిపాటు

  • జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావుకు నిరసన సెగ

  • జిన్నారంలో టికెట్‌ దక్కలేదని మహిళా అభ్యర్థి ధర్నా

ఆమనగల్లు/జహీరాబాద్‌/జిన్నారం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల వేళ కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మంగళవారం బీ ఫామ్‌ల పంపిణీ సందర్భంగా ఆ పార్టీ నేతలు బాహాబాహీకి దిగారు. 14వ వార్డు అభ్యర్థిత్వానికి సంబంధించి ఏకపక్షంగా వస్పుల సాయిలుకు టికెట్‌ ఎలా ఇస్తారంటూ వస్పుల సుగుణమ్మ మద్దతుదారులు రెచ్చిపోయారు. ఆగ్రహావేశాలతో కొందరు కార్యకర్తలు, నాయకులు కుర్చీలు విసిరి ధ్వంసం చేశారు. ఒక దశలో ఒకరినొకరు తోసుకుంటూ వాగ్వాదానికి దిగారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌కు వ్యతిరేకంగా పార్టీలోని ఓ వర్గం నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. జైపాల్‌ యాదవ్‌పైకి కుర్చీలు విసిరే ప్రయత్నం చేయగా.. అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావుకు నిరసన సెగ తగిలింది. ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన అక్బర్‌కు టికెట్‌ ఇచ్చి, తనకు మొండి చేయి చూపుతారా? అంటూ 14వ వార్డు అభ్యర్థిత్వం ఆశించిన ఆరీఫ్‌, అతని అనుచరులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే కుమారుడు మిథున్‌ను సైతం నిలదీశారు. దీంతో మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇదే మునిసిపాలిటీలో బీజేపీకి చెందిన బీఫామ్‌లను రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి నేరుగా అధికారులకు అందజేశారు. విషయం తెలుసుకున్న ఆశావహులు కార్యాలయానికి చేరుకుని టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ పైడి ఎల్లారెడ్డిని నిలదీశారు. కాగా, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో నాలుగో వార్డు నుంచి కాంగ్రెస్‌ తరఫుననీలం లత టికెట్‌ ఆశించగా.. ఆమెకు అవకాశం దక్కలేదు. దీంతో ఆగ్రహించిన ఆమె నామినేషన్ల స్వీకరణ కేంద్రం ఎదుట రోడ్డుపై బైఠాయించి, కాంగ్రెస్‌ మండల నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు.. జిన్నారానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్‌రెడ్డి సస్పెండ్‌ చేశారు.

Updated Date - Feb 04 , 2026 | 03:33 AM