తెలంగాణ విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:02 AM
తెలంగాణలోని వివిధ విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్‌రెడ్డి సమీక్షించారు.
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడితో కిషన్‌రెడ్డి భేటీ
వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి విమానాశ్రయాలపై చర్చ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలోని వివిధ విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్‌రెడ్డి సమీక్షించారు. రాజీవ్‌గాంధీ భవన్‌లోని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడి కార్యాలయంలో మంగళవారం ఆయనతో కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని విమానాశ్రయాల అభివృద్ధిపై పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్‌కుమార్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్‌కుమార్‌తో కలిసి సమగ్రంగా చర్చించారు. వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి సహా తెలంగాణలో ప్రతిపాదిత, పనులు జరుగుతున్న విమానాశ్రయ ప్రాజెక్టులపై విస్తృతస్థాయిలో కేంద్రమంత్రులు చర్చించారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు అవసరమైన చర్యలు, కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా.. వేగంగా పూర్తయ్యేలా.. సమయానుకూలంగా సమీక్ష నిర్వహించాలని ఇద్దరు మంత్రులు నిర్ణయించారు. వరంగల్ విమానాశ్రయం విషయంలో మొత్తం 953 ఎకరాల భూమి విమానాశ్రయం కోసం అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. దీంతో 2,500 మీటర్ల రన్‌వే నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే జూన్‌లో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని అధికారులు చెప్పారు. మరోవైపు ఆదిలాబాద్‌లో విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, అయితే రన్‌వే నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ప్రస్తుత భూమిని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లిలో విమానాశ్రయం కోసం 980 ఎకరాల భూమిని గుర్తించామని.. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ కూడా జరుగుతున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో విమానాశ్రయ మౌలిక వసతుల అభివృద్ధికి సంపూర్ణ మద్దతు అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు.