కార్యకర్తలకు అన్యాయం చేయొద్దు
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:34 AM
కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకే మునిసిపల్ ఎన్నికల్లో తాను అండగా ఉంటానని, వారి గెలుపు కోసం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే సంజయ్‌తో చర్చించి బీఫామ్‌లు ఇచ్చేస్తారా?
సంజయ్ వర్గానికి 30 ఇచ్చి, మాకు 20 టికెట్లే ఇస్తారా?
జగిత్యాలలో పరిస్థితిపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తా
కాంగ్రెస్ జెండా పట్టని వాళ్లకు టికెట్లు ఎలా ఇస్తారు?: టి.జీవన్‌రెడ్డి
జగిత్యాల, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకే మునిసిపల్ ఎన్నికల్లో తాను అండగా ఉంటానని, వారి గెలుపు కోసం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గానికి 30 టికెట్లు ఇచ్చి, తన వర్గానికి 20 టికెట్లే ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనతో తన మెడ కోసేసినట్టయిందని వ్యాఖ్యానించారు. పార్టీకి కోపం ఉంటే తనపై చర్య తీసుకోవాలి కానీ.. కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని కోరారు. జగిత్యాల, రాయికల్ పట్టణాల్లో వార్డుల వారీగా కాంగ్రెస్ తరఫున జారీ చేసిన బీఫామ్‌లపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగిత్యాలలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో పార్టీ పరిస్థితిని అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తానని, బీఫామ్‌ల కేటాయింపులో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై లిఖిత పూర్వక ఫిర్యాదు అందిస్తానని తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేసిన వారి పేర్లను మునిసిపల్ అభ్యర్థులుగా తాను ప్రతిపాదించి నిజామాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కు అందజేశానని చెప్పారు. కానీ, చివరకు.. జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో చర్చించి జగిత్యాల, రాయికల్ మునిసిపల్ అభ్యర్థుల జాబితాను రూపొందించారని మండిపడ్డారు.. పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఇచ్చిన నోటీసుకు.. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనేనంటూ సంజయ్‌కుమార్ వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల ఆయన గాంధీభవన్‌కు రావడంపై తాను నిలదీశానని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో కూర్చోబెట్టుకొని మునిసిపల్ ఎన్నికల టికెట్లపై చర్చించడం ఏంటని ప్రశ్నించారు. తుది జాబితాలోనూ మార్పులు, చేర్పులు ఏంటి? పార్టీలో ఏం జరుగుతోంది? అని అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఒక్కసారి కూడా కాంగ్రెస్ జెండా పట్టని వారికి బీ ఫామ్‌లు ఇచ్చారని విమర్శించారు. తాను ప్రతిపాదించిన అభ్యర్థుల జాబితాపై అభ్యంతరం ఉంటే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాల్సిందని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.