Share News

సుప్రీం కోర్టు నిబంధనల మేరకే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వొచ్చు

ABN , Publish Date - Feb 02 , 2026 | 02:57 AM

జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీకి చెందిన పాత్రికేయులకు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు ఇచ్చే వెసులుబాటు ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.

సుప్రీం కోర్టు నిబంధనల మేరకే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వొచ్చు

  • ఆ వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది

  • ఉన్నత వర్గాలతో జర్నలిస్టులను పోల్చొద్దు

  • వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి

  • న్యాయనిపుణుల వ్యాఖ్య

బోరబండ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీకి చెందిన పాత్రికేయులకు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు ఇచ్చే వెసులుబాటు ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయడంలో ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని సుప్రీం తీర్పు లో పేర్కొందన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ‘ఇళ్ల స్థలాలు- మార్గదర్శనం’ అనే అంశంపై ఆదివారం న్యాయనిపుణులతో సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ బి.ఎ్‌స.నారాయణ, జస్టిస్‌ చంద్రకుమార్‌, సీనియర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయనిపుణులు మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల కోసం డబ్బులు చెల్లించి, 18 ఏళ్లుగా పోరాడుతున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. సుప్రీం తీర్పులో జర్నలిస్టులకు దారులు మూసేయలేదని, అదే తీర్పులోని నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం ఉం దని జస్టిస్‌ బి.ఎ్‌స.నారాయణ చెప్పారు. సుప్రీంతీర్పులోని పేరా నంబరు 95లో పొందుపర్చిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తల దాచుకునేందుకు ఇంటిని ఏర్పాటు చేయడాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాథమిక అంశంగా చేర్చిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల (ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు) మాదిరిగా జర్నలిస్టులను చూడరాదని.. వారి ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వాలు జర్నలిస్టుల దయనీయ పరిస్థితిని అర్థం చేసుకొని, వారికి సంక్షేమాన్ని అం దిస్తే న్యాయవ్యవస్థ తప్పుపట్టే అవకాశం లేదని తెలిపారు. జర్నలిస్టులు ఆర్థికంగా బలహీనంగా ఉంటారని, వారిని ఎలైట్‌ గ్రూపులో కలపడం భావ్యం కాదని జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. సుప్రీం తీర్పులోని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఇళ్ల స్థలాలు సాధించుకోవాలని జర్నలిస్టులకు సూచించారు. హైకోర్టు సీనియర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఒకే న్యాయం ఉండాలన్నారు. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మిగతా వారికి ఇవ్వకుండా చేయడమనేది మౌలిక సూత్రాలకు విరుద్ధమని చెప్పారు. ఇప్పటికే మూడు దఫాలుగా సీనియర్‌ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలిచ్చారని.. జవహర్‌లాల్‌ సొసైటీ జర్నలిస్టులకు ఎందుకు ఇవ్వరని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వొచ్చనే దానిపై సీనియర్‌ న్యాయవాదులు అభిప్రాయాలు తెలియజేశారని, వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించి ఉన్న స్థలాలను ఇచ్చే వెసులుబాటు ఉందని అన్నారు. జర్నలిస్టులకు గతంలో కేటాయించిన పేట్‌బషీరాబాద్‌, నిజాంపేట స్థలాలను ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 02:57 AM