‘షాదీ డాట్ కామ్’తో మోసాలకు మార్గం సుగమం!
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:59 AM
పెళ్లి సంబంధాల వెబ్‌సైట్ ‘షాదీ డాట్ కామ్’తో మోసాలకు మార్గం సుగమం అవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది...
అందుకే మీ సంస్థపై కేసు నమోదైంది: సుప్రీంకోర్టు.. పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై ఆందోళన
షాదీ డాట్ కామ్ కేసును పునఃసమీక్షించండి
తెలంగాణ హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పెళ్లి సంబంధాల వెబ్‌సైట్ ‘షాదీ డాట్ కామ్’తో మోసాలకు మార్గం సుగమం అవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. షాదీ డాట్ కామ్ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్‌పై పునఃసమీక్షించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. షాదీ డాట్ కామ్‌లో యానాం ఎమ్మెల్యే ఫొటోతో రాజమహేంద్రవరానికి చెందిన చెరుకూరి హర్ష అలియాస్ జోగడ వంశీకృష్ణ ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు. అది చూసి, జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వైద్యురాలు అతన్ని సంప్రదించారు. హర్ష తన తల్లి డాక్టర్ అని, అమెరికాలో ఉందని నమ్మబలికాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పా డు. ఐటీ శాఖ తన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని, తిరిగి ఇస్తానంటూ ఆమె నుంచి పలు దఫాలుగా రూ.11 లక్షల వరకూ తీసుకున్నాడు. ఆ సొమ్ము తిరిగి అడగ్గా హర్ష తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. మరో రూ.10 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఆమెతోపాటు కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు ఇలాగే మాయమాటలు చెప్పి, బెంగళూరులో ఒకరి నుంచి రూ.27 లక్షలు తీసుకున్నాడని, ముంబైలో మరొకరిని మోసం చేశాడని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. హర్షతోపాటు షాదీ డాట్ కామ్ డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, టీం లీడర్ విఘ్నేష్, మేనేజర్ సతీశ్‌లను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిరాకరించింది. బీఎన్‌ఎ్‌సఎ్‌స 35(3) కింద నోటీసులు జారీ చేసి, విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ముగించింది. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని 23 జూన్ 2025న అనుపమ్ మిట్టల్ సహా ఇతరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి.అంజారియాల ధర్మాసనం విచారించింది. అనుపమ్ మిట్టల్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేవలం తాము మధ్యవర్తులం మాత్రమేనని, మిగిలిన అంశాలను క్లయింట్‌లే పరిశీలించుకోవాలని చెప్పారు. స్పందించిన ధర్మాసనం.. ‘‘మీరు ఆ మోసానికి మార్గం సుగమం చేస్తున్నారు కాబట్టే కేసు నమోదైంది’’ అని వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కంపెనీకి చెందిన రిలేషన్‌షి్‌ప మేనేజర్లు స్వయంగా ప్రొఫైళ్లను తనిఖీ చేసి ఇస్తారని, కాబట్టి కంపెనీకి బాధ్యత ఉంటుందని తెలిపారు. ఇరు వర్గాల వాదనల అనంతరం.. ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లదలుచుకోవడం లేదని, తెలంగాణ హైకోర్టే పునఃసమీక్షించాలని సూచించింది. ఎనిమిది వారాల పాటు అనుపమ్ మిట్టల్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలంటూ విచారణను ముగించింది.