Share News

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలను నియమించుకోవచ్చు!

ABN , Publish Date - Feb 04 , 2026 | 02:54 AM

తెలంగాణలో గవర్నర్‌ కోటాలో శాసనమండలి సభ్యులను నియమించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కోటా కింద తదుపరి ఎమ్మెల్సీల నియామకానికి గత ఆదేశాలు అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలను నియమించుకోవచ్చు!

  • కొత్త నియామకాలకు పాత ఆదేశాలు అడ్డంకి కాదు.. మంత్రివర్గ సిఫారసులపై గవర్నర్‌ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు

  • తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల భర్తీపై సుప్రీం స్పష్టత

  • అలీఖాన్‌ ఏఐని ఇతర పిటిషన్లకు జత చేసిన న్యాయస్థానం

  • తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గవర్నర్‌ కోటాలో శాసనమండలి సభ్యులను నియమించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కోటా కింద తదుపరి ఎమ్మెల్సీల నియామకానికి గత ఆదేశాలు అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది. అలాగే, కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి మంత్రివర్గం సిఫారసు చేసిన పేర్లపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉంటుందని తేల్చిచెప్పింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణల నియామకాన్ని రద్దు చేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం విచారించింది. దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణల తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌, తెలంగాణ ప్రభుత్వం తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌ దేవినా సెహగల్‌, న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌, కోదండరాం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. సుప్రీంకోర్టు గత ఆదేశాలతో ఎమ్మెల్సీగా తన నియామకం రద్దయిందని, తనను మళ్లీ ఎమ్మెల్సీగా నియమించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ అమీర్‌ అలీఖాన్‌ కూడా పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున న్యాయవాది సంజయ్‌ ఇంప్లీడ్‌ అప్లికేషన్‌(ఐఏ) దాఖలు చేశారు. ఈ విషయాన్ని ధర్మాసనానికి తెలియజేశారు. ఈ క్రమంలో నిరంజన్‌రెడ్డి కలుగజేసుకుని.. ఇకపై గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకాలకు కొత్త పేర్లను ప్రతిపాదించేందుకు మార్గం సుగమం చేయాలని, అందుకు మంత్రివర్గానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై కోర్టు గత ఆదేశాలు, గవర్నర్‌ అధికారాలు తదితర అంశాలను ప్రస్తావించారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొంత అస్పష్టత నెలకొందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అస్పష్టత ఎందుకు ఉంటుంది? గవర్నర్‌ కోటాలో కొత్తగా చేపట్టబోయే ఎమ్మెల్సీ నియామకాలకు కోర్టు గత ఆదేశాలేమీ అడ్డంకి కాదు. ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి మంత్రివర్గం సిఫారసు చేయొచ్చు. ఆ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్‌కు పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది’’ అని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ స్పష్టం చేశారు. అలాగే, అలీఖాన్‌ దాఖలు చేసిన ఏఐతోపాటు అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపారు. ఈ అంశంపై సమగ్ర విచారణ అవసరమన్నారు. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేశారు.


కేసు పూర్వాపరాలివీ..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్‌, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా.. రాజకీయ నేపథ్యం ఉందంటూ నాటి గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు. గవర్నర్‌ నిర్ణయాన్ని ఇద్దరూ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఆ కేసు నడుస్తుండగానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 2024 జనవరి 13న కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ పేర్లను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రివర్గం సిఫారసు చేయగా గవర్నర్‌ ఆమోదం తెలిపారు. అయితే, వారి నియామకాన్ని సవాలు చేస్తూ దాసోజు, సత్యనారాయణ మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనల తర్వాత 2024 మార్చి 17న హైకోర్టు సీజే ధర్మాసనం.. గవర్నర్‌ ఉత్తర్వులను రద్దు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్‌ల పేర్లను మంత్రివర్గం మరోసారి సిఫారసు చేయగా, గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ దాసోజు, సత్యనారాయణలు 2024 ఆగస్టు 4న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత కోదండరాం, అలీఖాన్‌ల నియామకాన్ని కోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. దీంతో తనను కూడా ఎమ్మెల్సీగా నియమించేలా ఆదేశాలివ్వాలంటూ అలీఖాన్‌ సుప్రీంను ఆశ్రయించగా.. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తోంది.

Updated Date - Feb 04 , 2026 | 02:54 AM