Share News

చార్జిషీట్‌కు రంగం సిద్ధం!

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:42 AM

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు, అధికారులను విచారించిన సిట్‌..

చార్జిషీట్‌కు రంగం సిద్ధం!

  • ట్యాపింగ్‌ కేసులో దూకుడు పెంచిన సిట్‌

  • కేసీఆర్‌ విచారణతో కొలిక్కి వచ్చిన దర్యాప్తు

  • త్వరలో న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశం

  • చార్జిషీట్‌లో కేసీఆర్‌, హరీశ్‌, సంతో్‌ష పేర్లు?

  • కేటీఆర్‌ను మళ్లీ విచారణకు పిలిచే అవకాశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు, అధికారులను విచారించిన సిట్‌.. ఆదివారం మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా ప్రశ్నించటంతో దర్యాప్తు దాదాపు ముగింపు దశకు చేరింది. దీంతో త్వరలోనే కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చార్జిషీట్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌, హరీశ్‌రావు, సంతో్‌షరావు పేర్లను చేర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ కేటీఆర్‌ను మరోసారి విచారణకు పిలవనున్నట్ల్లు సమాచారం. ఆ విచారణ పూర్తయ్యాక ఈ కేసులో ఆయన పాత్రపై పూర్తి స్పష్టత వస్తుందని సిట్‌ భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌పై దాఖలైన కేసులో ఇప్పటివరకు సిట్‌ పలువురిని విచారించింది. కిందిస్థాయి అధికారి నుంచి నాటి సీఎం కేసీఆర్‌ వరకు.. ఈ అంశంలో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారు? ఫోన్‌ ట్యాపింగ్‌కు ఎవరు ఆదేశాలిచ్చారు? అనే అంశాలపై సిట్‌ బృందం.. నేతలు, అధికారులను లోతుగా ప్రశ్నించి సమాచారం రాబట్టింది. వీటన్నింటి ఆధారంగాచార్జిషీట్‌ దాఖలు చేయనుంది. అధికారుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలతో.. ఇప్పటిదాకా విచారణలో రికార్డు చేసిన అధికారుల వాంగ్మూలాలు, సేకరించిన సాంకేతిక ఆధారాలతో చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో కేసీఆర్‌, ఇతర నేతల పాత్రపై అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు, సాంకేతిక అంశాలను చార్జిషీట్‌లో పొందుపరచనున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 02:42 AM