శంషాబాద్‌లో హైస్పీడ్ టెర్మినల్
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:06 AM
కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌కు ప్రకటించిన హైస్పీడ్ రైల్ కారిడార్ టెర్మినల్ శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానుంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణెలకు ‘దక్షిణ భారత హైస్పీడ్ డైమండ్ రైల్వే కారిడార్’ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మూడు మెట్రో నగరాలను కలుపుతూ దక్షిణ భారత హైస్పీడ్ డైమండ్ రైల్వే కారిడార్
విద్య, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాల్లో అభివృద్ధి
నాలుగు రాష్ట్రాల్లో ఆర్థిక ప్రగతికి ఊతం
హైస్పీడ్ రైళ్లలో 2 గంటల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, 3 గంటల్లో చెన్నైకి..
3 నెలల్లో డీపీఆర్ సిద్ధం.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్‌లో 5,454 కోట్లు: రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌కు ప్రకటించిన హైస్పీడ్ రైల్ కారిడార్ టెర్మినల్ శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానుంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణెలకు ‘దక్షిణ భారత హైస్పీడ్ డైమండ్ రైల్వే కారిడార్’ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కారిడార్‌తో దక్షిణాదిన ఉన్న రెండు మెట్రో నగరాలతో పాటు పశ్చిమాన ఉన్న మరో రెండు (పుణె, ముంబై) ముఖ్య నగరాలకు శంషాబాద్ అనుసంధానం కానుంది. ఆయా కారిడార్లలో గంటకు సుమారు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైళ్లకు శంషాబాద్ టెర్మినల్ నుంచే కార్యకలాపాలు, నిర్వహణ పనులు జరగనున్నాయి. ఈ మేరకు మూడు నెలల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రూపొందిస్తామని సోమవారం రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ ప్రకటించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే వివిధ రాష్ట్రాల మీడియా ప్రతినిధులతో వర్చువల్‌గా కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు రైల్వే కేటాయింపులను వివరించారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం 2026-27 బడ్జెట్లో రూ.5,454 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.47,984 కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. యూపీఏ హయాంలో తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే తాజా కేటాయింపులు ఆరు రెట్లు పెరిగాయని వివరించారు. రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ 100 శాతం పూర్తయిందన్నారు. దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించగా, వాటిలో హైదరాబాద్ నుంచే 3 కారిడార్లు ఉండడం తెలంగాణకు గేమ్ చేంజర్ కాబోతోందని చెప్పారు. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందుతుందని తెలిపారు.
2 గంటల్లో బెంగళూరు, 3 గంటల్లోపే చెన్నైకి..
హైదరాబాద్-పుణె, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. దక్షిణాదిన మూడు ప్రధాన మెట్రో నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను కలుపుతూ ఏర్పాటు చేసే హైస్పీడ్ రైల్ కారిడార్‌తో విద్య, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు కొత్త శక్తి లభిస్తుందని చెప్పారు. ఇది దేశానికే ఆర్థికాభివృద్ధి కారిడార్‌గా పనిచేస్తుందన్నారు. డైమండ్ కారిడార్‌లో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటలు, హైదరాబాద్ నుంచి చెన్నైకి 2.55 గంటలు, హైదరాబాద్ నుంచి పుణేకు 1.55 గంటల్లో చేరుకోవచ్చని తెలిపారు. హైస్పీడ్ రైల్వే కారిడార్‌తో హైదరాబాద్ ఆర్థిక కేంద్రంగా మారుతుందని, ఇది తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రి చెప్పారు.
ఎంఎంటీఎస్ ఫేజ్2లో కొత్త రైళ్లు కష్టమే!
హైదరాబాద్ నగర వాసులు డిమాండ్ చేస్తున్న ఎంఎంటీఎస్ ఫేజ్2లో కొత్త రైళ్లు ఇప్పట్లో కష్టమేనని తెలుస్తోంది. బడ్జెట్‌లో ఫేజ్2లో కొత్త రైళ్లను ప్రవేశపెట్టకపోవడం, ఘట్‌కేసర్ నుంచి యాదగిరిగుట్టకు ఫేజ్2 పొడిగింపు ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు దక్షిణమధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ బదులిచ్చారు. ఎంఎంటీఎస్ సర్వీసులను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ, పెరిగిన రైళ్లతో ప్రస్తుతం ఉన్న ట్రాక్‌లన్నీ నిండిపోయాయని.. దీంతో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మెట్రో రాకతో ప్రస్తుతం నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లకు ఆదరణ తగ్గిందన్నారు. ఫేజ్2కు మరింత సమయం పడుతుందన్నారు.