ధ్వంసం చేయమంటే.. నిల్వ!
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:16 AM
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయమంటే దొంగచాటున నిల్వచేసి విక్రయించేందుకు యత్నించిన ముఠా గుట్టు రట్టయింది...
రూ. 40 లక్షల విలువైన విదేశీ మద్యం పట్టివేత
నర్సాపూర్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయమంటే దొంగచాటున నిల్వచేసి విక్రయించేందుకు యత్నించిన ముఠా గుట్టు రట్టయింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్‌మద్దూరులోని బయో మెడికల్ ప్లాంట్‌లో మంగళవారం అధికారులు జరిపిన దాడుల్లో రూ.40 లక్షల విలువైన విదేశీ మద్యం పట్టుబడింది. హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో పట్టుపడిన నాన్ డ్యూటీ పెయిడ్, విదేశీ మద్యాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఈ ప్లాంటుకు పంపింది. అయితే ప్లాంట్ సిబ్బంది మద్యాన్ని ధ్వంసం చేయకుండా, సుమారు 783 బాటిళ్లను అక్రమంగా నిల్వ చేశారని అధికారులకు సమాచారం అందింది. నర్సాపూర్ ఎక్సైజ్ అధికారులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్లాంట్‌పై దాడి చేసి, గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్లాంట్ సిబ్బంది అభయ్, నాగుల్‌మీరా, కుమార్ సాయి, రాజేశ్‌లను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.