ఇద్దరు మిత్రుల విజయ సోపానం
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:38 AM
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. శత్రువుల విషయం పక్కనబెడితే కొందరు మాత్రం గొప్ప స్నేహితులుగా రాజకీయాల్లో......
2 దశాబ్దాల నుంచి ఆప్త మిత్రులుగా సీఎం రేవంత్, వేం నరేందర్‌రెడ్డి
2007 నుంచి కలిసి నడుస్తున్న స్నేహితులు
నాడు వైఎస్‌ఆర్ - కేవీపీ, నేడు రేవంత్-నరేందర్ అని చర్చ
సీఎం సలహాదారు పోస్టుకు
నరేందర్ రాజీనామా.. ఆమోదించిన సీఎస్
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. శత్రువుల విషయం పక్కనబెడితే కొందరు మాత్రం గొప్ప స్నేహితులుగా రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. తెలుగునాట రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావుల స్నేహం తరుచూ చర్చకు వచ్చేది. అలాంటి స్నేహితులే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. వారే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి. రాజకీయాల్లో వీరి స్నేహం రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది.
మిత్రుడి కోసం రేవంత్ త్యాగాలు
రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒకదానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డిని ప్రకటించటంతో రేవంత్, నరేందర్ స్నేహంపై రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 9తో రెండు రాజ్యసభ స్థానాల గడువు ముగుస్తోంది. వీటికి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా అభిషేక్ మనుసింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డిలను ప్రకటించారు. సింఘ్వీకి ఏఐసీసీ కోటాలో టికెట్ ఇవ్వగా, పార్టీ అధిష్ఠానంతో కొట్లాడి నరేందర్‌రెడ్డికి సీఎం టికెట్ ఇప్పించినట్లు చెబుతున్నారు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో అనేక ఆటుపోట్లు ఎదురైనా వీరు స్నేహాన్ని వీడకుండా ముందుకు సాగుతున్నారు. 2004లో నరేందర్‌రెడ్డి టీడీపీ నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందగా, 2007లో రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీగా మండలిలోకి అడుగు పెట్టారు. రేవంత్ టీడీపీలోకి రావడంతో.. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం మొదలైంది. అప్పటి నుంచి ఇద్దరూ ఒక్కటిగానే ముందుకు సాగుతున్నారు. 2015లో ఎమ్మెల్యే కోటాలో వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేసేందుకు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కూడా వీరి మధ్య స్నేహం మరింత బలపడిందే కానీ.. బీటలు వారలేదు. ఆ తరువాత రేవంత్‌తో పాటే నరేందర్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. కష్టసుఖాల్లో రేవంత్‌కు చేదోడువాదోడుగా నిలిచారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో రేవంత్ సీఎం అయ్యారు. ఆ వెంటనే నరేందర్‌ను తన సలహాదారుగా నియమించుకున్నారు. తాజాగా రాజ్యసభకు పంపుతున్నారు. పోటీ లేకపోవటంతో నరేందర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నాడు వైఎ్‌సఆర్ కూడా సీఎం కాగానే తన మిత్రుడు కేవీపీని మొదట సలహాదారుగానే నియమించుకున్నారు. ఆ తరువాత నాలుగేళ్లకు హైకమాండ్‌ను ఒప్పించి రాజ్యసభకు పంపారు. రేవంత్ మాత్రం రెండేళ్లలోనే నరేందర్‌కు ఎంపీని చేశారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
పెద్దల సభకు వెళ్లినా.. ప్రభుత్వంలోనే బాధ్యతలు
రాజ్యసభ అభ్యర్థిగా టికెట్ లభించటంతో ‘సీఎం సలహాదారు’ పదవికి వేం నరేందర్‌రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిరామకృష్ణారావుకు పంపగా, వెంటనే ఆమోదించారు. అయితే, నరేందర్ రాజ్యసభకు వెళ్లినా తిరిగి ప్రభుత్వంలోకే వస్తారనే చర్చ జరుగుతోంది. నాడు కేవీపీ కూడా రాజ్యసభకు వెళ్లినా రాష్ట్ర ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వహించారు. అందుకోసం అడ్వైజరీ కౌన్సిల్ కమిటీని ఏర్పాటుచేసి, దానికి కేవీపీని చైర్మన్‌గా నియమించారు. అదే తరహాలో ఇప్పుడు నరేందర్‌రెడ్డి కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంలోపలు బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. అయుతే, సలహాదారుగా జీతభత్యాలతో పనిచేసిన నరేందర్.. ఇకపై జీతభత్యాలు లేకుండా పనిచేయనున్నారు.