రియల్ ఎస్టేట్ బాధితులకు అండగా రెరా
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:11 AM
సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు పైసాపైసా కూడబెట్టి, అప్పులు చేసి తెచ్చిన డబ్బును చేతిలో పెడితే కొంతవరకు పనులు చేసిన తర్వాత బిల్డర్లు చేతులెత్తేసిన ఘటనలు చూస్తున్నాం..
నిలిచిపోయిన అపార్ట్‌మెంట్‌ను పూర్తి చేయించిన సంస్థ
బిల్డర్ చేతులెత్తేస్తే కొనుగోలుదారులను ఆదుకున్న రెరా
హైదరాబాద్ సమీపంలోని బౌరంపేట్‌లో ఘటన
2022 జూన్‌లో నిర్మాణ పనులు ఆపేసిన బిల్డర్
రెరాను ఆశ్రయించిన కొనుగోలుదారులు
వారితోనే అసోసియేషన్ ఏర్పాటు.. పనులు పూర్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్ర జ్యోతి): సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు పైసాపైసా కూడబెట్టి, అప్పులు చేసి తెచ్చిన డబ్బును చేతిలో పెడితే కొంతవరకు పనులు చేసిన తర్వాత బిల్డర్లు చేతులెత్తేసిన ఘటనలు చూస్తున్నాం.. వింటున్నాం. అలాంటి బిల్డర్లను నమ్మి మోసపోయిన వారి పరిస్థితి వర్ణనాతీతం. అయితే, అపార్ట్‌మెంట్ నిర్మాణ ప్రాజెక్టులో 60 శాతం పనులు పూర్తయ్యాక బిల్డర్ ముఖం చాటేయగా.. ఆ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ల కొనుగోలుదారులకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) అండగా నిలిచింది. కొనుగోలుదారులతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేయించి.. ఆ అపార్ట్‌మెంట్ పనులను పూర్తి చేయించి కొనుగోలుదారుల సొంతింటి కలను నెరవేర్చింది. హైదరాబాద్ సమీపంలోని బౌరంపేట్‌లో ఈ ఘటన జరిగింది. రెరా కథనం ప్రకారం.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్‌లోని 2731.78 చదరపు గజాల స్థలంలో జయాప్లాటినమ్ పేరిట చేపట్టిన 5 అంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మాణ పనులు 2022 జూన్ నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు 60 శాతం పనులు పూర్తవ్వగా ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదు. ప్రమోటర్ నుంచి సరైన స్పందన కూడా లేదు. దీంతో అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ల కొనుగోలుదారులు రెరాను ఆశ్రయించారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన రెరా .. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ద్వారా 2023 డిసెంబరు 1న సాంకేతిక పరిశీలన చేయించింది. ప్రమోటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించి.. సదరు ప్రమోటర్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. 2024 జనవరి 11న ప్రమోటర్‌కు షోకాజు నోటీసు ఇచ్చింది. ప్రమోటర్‌ను డీఫాల్టర్‌గా ప్రకటించింది. అలాగే, జేపీ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఏర్పాటు చేసిన కొనుగోలుదారుల సంఘానికి నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. ఆ సంఘం ఆధ్వర్యంలో మిగిలిన పనులు పూర్తవ్వగా.. 2026 జనవరి 5న జయాప్లాటినమ్ అపార్ట్‌మెంట్‌కు అక్యుఫెన్సీ సర్టిఫికెట్ కూడా జారీ అయింది. దీంతో జయా ప్లాటినమ్‌కు చెందిన కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేశారు. కొనుగోలుదారుల హక్కులను కాపాడేందుకు తాము తీసుకున్న చొరవ వల్ల రియల్‌ఎస్టేట్ రంగంలో మోసపోతున్న కొనుగోలుదారులకు రెరా అండగా ఉంటుందనే నమ్మకం ఏర్పడిందని ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటన చేసింది.