Share News

పెద్దవాగు మరమ్మతులపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:18 AM

గోదావరి బేసిన్‌లో ఒకే ఒక్క అంతర్రాష్ట్ర ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారింది. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో ఉన్న...

పెద్దవాగు మరమ్మతులపై నిర్లక్ష్యం

  • జీఆర్‌ఎంబీ భేటీకి అధికారుల డుమ్మా

  • ప్రాజెక్టు పునరుద్ధరణపై మీనమేషాలు

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి బేసిన్‌లో ఒకే ఒక్క అంతర్రాష్ట్ర ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారింది. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు కట్ట 2024 జూలైలో వచ్చిన భారీ వరదలకు కోతకు గురైంది.ప్రాజెక్టు స్పిల్‌వే వరద సామర్థ్యం 40,500 క్యూసెక్కులు కాగా... 88 వేల క్యూసెక్కుల వరద రావడంతో కొన్ని చోట్ల కట్ట తెగిపోయింది. దీనికి ప్రధానంగా నిర్వహణ లోపాలే కారణమని తేలింది. అయితే, డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్రాజెక్టు(డ్రిప్‌) కింద ఈ ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు సీడబ్ల్యూసీ అంగీకారం తెలుపుతూ.. గోదావరి బోర్డు (జీఆర్‌ఎంబీ) పర్యవేక్షణలో చేపట్టాలని అప్పట్లోనే సిఫారసు చేసింది. ఈ నిర్ణయమే స్థానిక అధికారులకు కంటగింపుగా మారినట్లు సమాచారం. పునరుద్ధరణ ప్రక్రియ అమలులో భాగంగా గురువారం హైదరాబాద్‌లో జలసౌధలో గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేయగా.. ఏపీ నుంచి ఐదుగురు అధికారులు హాజరైతే, తెలంగాణ నుంచి ఒక్క అధికారి కూడా హాజరు కాలేదు. సమావేశానికి ఎందుకు రావడం లేదని గోదావరి బోర్డు ఆరా తీస్తే... ‘పెళ్లిళ్లు ’ ఉన్నాయనే సమాధానం వచ్చినట్లు తెలిసింది. గోదావరి బోర్డు పర్యవేక్షణలో, డ్రిప్‌లో ఈ ప్రాజెక్టును చేపట్టడం ఇష్టం లేకనే అధికారులు ఇలా వ్యవహరించారన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి డ్రిప్‌ కింద ఏ పని చేయాలన్నా ప్రపంచ బ్యాంక్‌ పరోక్ష పర్యవేక్షణ ఉంటుంది. ఏ కాంపోనెంట్‌లోనూ అడ్డగోలుగా అంచనాలు పెంచడానికి వీల్లేదు. ఈ కారణంగానే అధికారులు ఈ ప్రాజెక్టుపై అశ్రద్ధ చూపుతున్నారన్న విమర్శలు తలెత్తుతున్నాయి.

Updated Date - Mar 06 , 2026 | 03:18 AM