Share News

పామాయిల్‌ రైతుల నోట్లో మట్టికొడుతున్న కేంద్రం

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:52 AM

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి పామాయిల్‌పై సుంకం పెంచాలని ఓ వైపు రైతులు విజ్ఞప్తి చేస్తుంటే.. కేంద్రం మాత్రం సుంకాన్ని తగ్గించిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

పామాయిల్‌ రైతుల నోట్లో మట్టికొడుతున్న కేంద్రం
TummalaNageshwarrao

  • దిగుమతి సుంకాన్ని 16.5 నుంచి

11 శాతానికి తగ్గించడం అన్యాయం

  • రైతుల ప్రయోజనాలకు విఘాతం

  • 44 శాతానికి పెంచాలన్న విజ్ఞప్తిని

బుట్టదాఖలు చేసిన కేంద్రం

  • తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని.. సుంకాన్ని పెంచాలి: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి పామాయిల్‌పై సుంకం పెంచాలని ఓ వైపు రైతులు విజ్ఞప్తి చేస్తుంటే.. కేంద్రం మాత్రం సుంకాన్ని తగ్గించిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పామాయుల్‌ రైతుల నోట్లో మట్టికొడుతోందని ధ్వజమెత్తారు. కేంద్ర నిర్ణయంతో దేశీయ పామాయిల్‌ రైతుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటివరకు 16.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తే.. అందుకు భిన్నంగా 11 శాతానికి తగ్గించడం దారుణమని తుమ్మల గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓవైపు దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్న కేంద్రం.. మరోవైపు రైతుల నడ్డివిరిచేలా దిగుమతి సుంకాన్ని తగ్గించి, విదేశీ దిగుమతులను ప్రోత్సహించడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 3.20 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేస్తున్నారని, సాగు విస్తీర్ణంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని తెలిపారు. రైతులను పామాయిల్‌ వైపు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. జాతీయ ఆయిల్‌పామ్‌ మిషన్‌ ద్వారా ఆయిల్‌పామ్‌ ఉత్పత్తి పెంపు, వంటనూనెల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడమే లక్ష్యమని ప్రకటించిన కేంద్రం.. అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆక్షేపించారు. రైతుల ఆదాయాన్ని పెంచుతామని చెప్పే కేంద్ర ప్రభుత్వం.. విదేశీ దిగుమతులపై ఆధారపడే విధానాలను ప్రోత్సహించడం ఆత్మనిర్భర భారత్‌ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. తెలంగాణ రైతులు నమ్మకంతో పామాయిల్‌ సాగులోకి వచ్చారని, ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తుమ్మల స్పష్టం చేశారు.


కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, దిగుమతి సుంకం గణనీయంగా పెంచాలని, దేశీయ పామాయిల్‌ రైతులకు రక్షణ కల్పించే విధానాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం టన్ను పామాయిల్‌ గెలలకు రూ.25 వేల కనీస హామీ ధర ప్రకటించాలని, దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 25 , 2026 | 03:52 AM