Share News

క్యాన్సర్‌ బాధితుల కోసంమేమున్నామనీ..

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:44 AM

క్యాన్సర్‌ వస్తే.. రోగికే కాదు.. ఇంట్లోవారికీ మానసిక ఆందోళనే.. పైగా భారీగా వైద్య ఖర్చులు! అటెండెంట్‌గా ఎవరైనా పెడితే రోగిని బాగా చేసుకుంటారా...

క్యాన్సర్‌ బాధితుల కోసంమేమున్నామనీ..

  • రోగులకు పాలియేటివ్‌ కేర్‌ సేవలు

  • నొప్పులు, మానసికఒత్తిడి నుంచి ఉపశమనం

  • ఉచిత చికిత్స, మందులు, ఫిజియోథెరపీ

  • రోగుల సేవలో ఎంఎన్‌జే పాలియేటివ్‌ కేర్‌

  • అనాథల పాలిట ఆపన్నహస్తంగా ‘స్పర్ష్‌‘

  • చికిత్స తర్వాతా సేవలో క్యూర్‌ ఫౌండేషన్‌

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ వస్తే.. రోగికే కాదు.. ఇంట్లోవారికీ మానసిక ఆందోళనే.. పైగా భారీగా వైద్య ఖర్చులు! అటెండెంట్‌గా ఎవరైనా పెడితే రోగిని బాగా చేసుకుంటారా? అన్న టెన్షనూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో క్యాన్సర్‌ బాధితులకు బాసటగా నిలుస్తున్నాయి పలు సంస్థలు, ఎన్జీవోలు. బాధితులను తమ కేంద్రాల్లోనే ఉంచుకొని చికిత్స, సేవలు అందిస్తున్నాయి. ఇంటి పట్టునే ఉండటాన్ని ఇష్టపడే రోగులకు వారి వద్దకే వెళ్లి సేవలందిస్తున్నాయి. అవే.. ఎంఎన్‌జే పాలియేటివ్‌ కేర్‌, స్పర్ష్‌ హాస్పీస్‌, క్యూర్‌ ఫౌండేషన్‌ సంస్థలు. పాలియోటివ్‌ కేర్‌ సేవలు అవసరం నుంచి చివరి మజిలీ వరకు క్యాన్సర్‌ భాధితుల అవసరాలు తీరుస్తున్నాయి. పాలియేటివ్‌ కేర్‌ అనేది క్యాన్సర్‌ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడే రోగుల జీవన నాణ్యతను మెరుగు పరచడానికి అనుసరించే ప్రత్యేక విధానం. రోగులకు తీవ్ర నొప్పులు, మానసిక ఒత్తిడిని నియంత్రించి సంరక్షించే విధానం. ఈ సంస్థలు రోగులు, వారి కుటుంబాలకు కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నాయి.

ఎంఎన్‌జే పాలియేటివ్‌ కేర్‌

ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ దేశంలోనే అతిపెద్ద పాలియేటివ్‌ కేర్‌ కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది. రోగి పేరును నమోదైన తొలిరోజు నుంచి వారి చివరి దశ వరకు, ఆ తర్వాత కుటుంబసభ్యులకు శోకసాంత్వన అందించే సమగ్ర పాలియేటివ్‌ కేర్‌ సేవలను ఎంఎన్‌జే కార్యకర్తలు అందిస్తున్నారు. ఈ బృందంలో వైద్యులు, నర్సులు, సామాజిక కార్యకర్తలు, కౌన్సెలర్లు ఉంటారు. రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే వీరి లక్ష్యం. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఎంఎన్‌జే ఆధ్వర్యంలో పాలియేటివ్‌ కేర్‌ సేవలు అందిస్తున్నారు. సెలవు రోజులు మినహా ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆస్పత్రిలో ఓపీ సేవలను అందిస్తున్నారు. పాలియేటివ్‌ సేవలు పొందాలనుకునే రోగులు ఓపీలో వచ్చి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంఎన్‌జే ఆస్పత్రి భవనంలో 24 గంటల పాటు అడ్మిషన్లు, ఇన్‌ పేషంట్ల చికిత్సలు అందిస్తారు. పాలియేటివ్‌ కేర్‌కు ప్రత్యేకంగా 21 పడకలు ఏర్పాటుచేశారు. ఇక్కడ పీజీ, రెసిడెంట్‌ డాక్టర్లు, కౌన్సెలర్లు, కో ఆర్డినేటర్లు సేవలు అందిస్తుంటారు. నెలకు 110 మంది వరకు ఇక్కడ చికిత్సలు పొందుతుంటారని విభాగం అధిపతి డాక్టర్‌ గాయత్రి, కో ఆర్డినేటర్‌ శివ జ్యోతి వివరించారు. ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్దనే ఉంటామని భావించే రోగులకు హోమ్‌ కేర్‌ సేవలు అందిస్తున్నారు. వారానికి ఒకసారి ఇంటికి పాలియేటివ్‌ కేర్‌ సిబ్బంది వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించడం, అవసరమైన పరీక్షలు చేయడం, మందుల పంపిణీ, కౌన్సిలింగ్‌ వంటివి చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా 13 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు.


పిల్లల పాలియేటివ్‌ కేర్‌

కూకట్‌పల్లిలో హాస్పీస్‌ కేర్‌ పేరుతో ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పిల్లలకు ప్రత్యేక సంరక్షణను నిర్వహిస్తున్నారు. ఇక్కడ 33 పడకలు ఏర్పాటు చేసి కో-ఆర్డినేటర్‌ వినీల పర్యవేక్షణలో జీవన చరమాంకంలో ఉన్న రోగులకు సేవలందిస్తున్నారు. నిలోఫర్‌ ఆస్పత్రిలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఓపీలో పాలియేటివ్‌ కేర్‌ సేవలు, కౌన్సెలింగ్‌, అవగాహన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

క్యూర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో

క్యూర్‌ ఫౌండేషన్‌ క్యాన్సర్‌ నివారణ, తొలిదశ గుర్తింపు, చికిత్స, పునరావాసంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ. సమాజహితార్థం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, ఇప్పటివరకు 17వేల కంటే ఎక్కువ ఆర్థికంగా వెనుకబడిన రోగులకు సబ్సిడీపై నాణ్యమైన క్యాన్సర్‌ చికిత్సను అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. క్యూర్‌ ఒక లాభాపేక్షలేని సంస్థ అని, ప్రతి వ్యక్తికి సమానంగా, అందుబాటులో ఉండే నాణ్యమైన వృత్తిపరమైన క్యాన్సర్‌ చికిత్సను అందించడం, ప్రతి రోగిలో జీవితంలో దీర్ఘకాలిక మార్పు తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు డాక్టర్‌ విజయ్‌ ఆనంద్‌రెడ్డి తెలిపారు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్న వారికి మద్దతు, పునరావాస సదుపాయాలు అందించడాన్ని ప్రత్యేకంగా చేపట్టినట్లు తెలిపారు.

స్పర్ష్‌ ఆప్పన్నహస్తం

క్యాన్సర్‌ బాధితుల చివరి మజిలీ వరకు నొప్పి, బాధ లేకుండా సంతోషంగా గడిపేందుకు స్పర్ష్‌ హాస్పీ్‌సలో సాంత్వన చేకూరుస్తున్నారు. 2011 నుంచి నిరంతరం రోగులకు సేవలందిస్తున్నారు. బంజారాహిల్స్‌లో మొదట స్పర్ష్‌ సంస్థను ఏర్పాటు చేసి అనేక మందికి సేవలను అడ్మిట్‌ చేసుకొని చికిత్సలు అందించింది. సేవలను విస్తరించడానికి నానక్‌రాంగూడలో ప్రభుత్వం భూమి కేటాయించడంతో అక్కడ ప్రత్యేక భవనం నిర్మించి 70 పడకలను ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నారు. ఇంట్లో, కుటుంబసభ్యుల మధ్య ఉన్నట్లు ఉండే వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తున్నట్లు వ్యవస్థపక ట్రస్టీ డాక్టర్‌ సుబ్రహ్మణ్యం చెప్పారు. ప్రత్యేకంగా ఎనిమిది గదులను ఏర్పాటు చేసి సాధారణ రుసుముతో చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. వార్డులో ఉండే వారికి పూర్తిగా ఉచితంగా సేవలు చేస్తున్నట్లు చెప్పారు. ఎనిమిది ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికి పాలియేటివ్‌ కేర్‌ సేవలను అందిస్తున్నారు. ఇంట్లోనే ఉంచి అన్ని రకాల వైద్య సేవలు, మందులు, కౌన్సెలింగ్‌ను కల్పిస్తున్నామని, అవసరమైన వారికి అపరేషన్లు చేయిస్తున్నట్లు వివరించారు.

Updated Date - Feb 04 , 2026 | 03:44 AM