30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తి
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:51 AM
వచ్చే 30 నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
2027 మార్చికల్లా కల్వకుర్తి, నెట్టెంపాడు భీమా, కోయిల్‌సాగర్ పూర్తి
జూరాల డీసిల్టింగ్ పనులుప్రారంభించాలి: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే 30 నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సమృద్థిగా సాగు, తాగునీరు అందిస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా సహా దక్షిణ తెలంగాణ రైతులకు సరిపడా సాగు నీరందించడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం జలసౌధలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఇతర ప్రజా ప్రతినిధులతో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణ దశలోని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని చెప్పారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టేంపాడుకు రూ. 252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిలసాగర్ ప్రాజెక్టుకు రూ. 185 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, పునరావాస పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే జూన్ రెండో తేదీకల్లా రూ.5000 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల పథకంలో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లే పాలమూరు- రంగారెడ్డి పథకంలో ఆఫ్‌టేక్ పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడంతో లిఫ్ట్ ఖర్చులు పెరిగి రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని ఉత్తమ్ చెప్పారు. జూరాల ప్రాజెక్టు డీసిల్టింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్‌ఎ్‌సది గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆయ అన్నారు.