నేడో, రేపో 70 మందికిపైగా మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:16 AM
మావోయిస్టు పార్టీలో మిగిలిన అగ్రనేతలతోపాటు ఇంకా రహస్య జీవితం గడుపుతున్న 70మందికి పైగా మావోయిస్టులు రాష్ట్ర పోలీసులకు టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం.
డీజీపీ సమక్షంలో ప్రకటించే అవకాశం
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీలో మిగిలిన అగ్రనేతలతోపాటు ఇంకా రహస్య జీవితం గడుపుతున్న 70మందికి పైగా మావోయిస్టులు రాష్ట్ర పోలీసులకు టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో వీరి లొంగుబాటును డీజీపీ సమక్షంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలనూ వెల్లడించనున్నట్టు సమాచారం. తాజాగా లొంగుబాట పట్టిన వారిలో రాష్ట్ర, డివిజన్, ఏరియా కమిటీ సభ్యులు, పీఎల్‌జీఏ బెటాలియన్ల కమాండర్లు ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లో తెలంగాణ పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉన్న రాష్ట్ర కమిటీ స్థాయి నేత ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ తన దళాలతో లొంగిపోవడంతో మిగిలిన వారు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత గణపతి ఆయన భార్య జోడే రత్నాభాయి ఇప్పటికే రాష్ట్ర పోలీసుల అదుపులో ఉన్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో వారి లొంగుబాటు ఉండవచ్చని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, ఎస్‌ఐబీ చీఫ్ సుమతి కలిశారు. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటును ఆయా పోలీసులే చూపితే బాగుంటుందని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం ఏరియాకు చెందిన డి విజనల్ కమిటీ మెంబర్ నవత, జయశంకర్ భూపాలపల్లి నివాసి, డివిజనల్ కమిటీ మెంబర్ సుధాకర్‌తోపాటు వారి దళ సభ్యులు, సుశీల, సంగీత, భాగ్య తదితరులు కూడా లొంగిపోయినట్లు తెలుస్తోంది. వీరితో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో చివరిగా మిగిలిన ఇద్దరు కమాండర్లు సైతం తమ వద్ద ఉన్న అత్యంత ఆధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్ల రాజిరెడ్డి, దామోదర్, నర్సింహరెడ్డిల లొంగుబాటు సమయంలో ఇంకా పార్టీలో తెలంగాణకు చెందిన వారు 11 మంది మాత్రమే మిగిలి ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. వీరిలో ఏడుగురు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇక కర్రెగుట్టలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు చెందిన కింది స్థాయి క్యాడర్‌లో సుమారు 30 మంది ఉన్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అలాగే శరండా నదీ తీరంలో మరో దళం లొంగిపోవాల్సి ఉందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అగ్రనేతలు తప్ప ఇంకా మిగిలిన వారు 150 మందిలోపే ఉండవచ్చని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఒడిశా, జార్ఖండ్ సరిహద్దులో ఇంకా కొన్ని దళాలున్నాయని, అగ్రనాయకత్వం లొంగుబాట పట్టిన క్రమంలో వారు సురక్షిత లొంగుబాటుకు మార్గాలు వెదుకుతున్నారని తెలుస్తోంది.
తండ్రి రాకకై ఎదురుచూస్తున్నా
నమ్మిన సిద్ధాంతం కోసం దీర్ఘకాలం చేసే పోరాటం ఆత్మార్పణం లాంటిదేనని మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కుమారుడు ముప్పాల శ్రీనివాస రావు పేర్కొన్నట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రి రాక కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఆ ఆడియోలో ఆయన భావోద్వేగంతో చెప్పారు. ఆ ఆడియోలోని వివరాల ప్రకారం.. చిన్ననాటి నుంచి నాన్న అనే పిలుపునకు దూరమయ్యాయని అన్నారు. దిగువ మధ్య తరగ చిన్నప్పటి నుంచి నాన్నను చూడాలని, ఆయన అండలో ఎదగాలని ఎన్నోసార్లు అనిపించేదని, తండ్రి గుర్తుకొచ్చిన ప్రతిసారి తన హృదయం భారమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని దిక్కులు చూసినా నాన్న కన్పించడని, తన హృదయఘోష ఆయనకు వినిపించదని నిర్వేదం వ్యక్తం చేశారు. విప్లవం అంటేనే కష్టనష్టాలతో కూడుకున్నదని, అనేకమంది యోధులు తమ కుటుంబాలను వదిలి ప్రజల కోసం పోరాడి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు.