Share News

104 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:17 AM

రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను అరికట్టడానికి హైదరాబాద్‌ నగర పోలీసులు రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించడానికి హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌..

104 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌

  • 16 రాష్ట్రాల్లో ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’

  • దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను ఛేదించిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

  • రూ.127 కోట్లు కొల్లగొట్టినట్లు నిర్థారణ

  • 36 లక్షలు, 204 పైగా ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను అరికట్టడానికి హైదరాబాద్‌ నగర పోలీసులు రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించడానికి హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌.. ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇటీవలి కాలంలో పెట్టుబడుల కుంభకోణాలు, ట్రేడింగ్‌ మోసాలు, డిజిటల్‌ అరె్‌స్టల పేరుతో అమాయక ప్రజలను భయపెట్టి.. వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్న ఘటనలు పెరగడంతో ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. సుమారు 80 మంది పోలీసులతో 32 బృందాలుగా ఏర్పడి 16 రాష్ట్రాల్లో గా లించి.. 104 మంది సైబర్‌ నేరస్థులను అరెస్టు చేశారు. 151 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. రూ.36 లక్షల నగదుతోపాటు 204 మొబైల్‌ ఫోన్లు, 141 సిమ్‌ కార్డులు, 152 బ్యాంక్‌ పాస్‌పుస్తకాలు, 234 డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, 26 ల్యాప్‌టా్‌పలు, 56 కార్పొరేట్‌ సంస్థల స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ అరవింద్‌బాబు మంగళవారం ఆపరేషన్‌ ఆక్టోపస్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన సీపీ.. అన్ని రకా ల ఆధారాలతో ఆపరేషన్‌ ఆక్టోప్‌సను ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లోని సైబర్‌ నేరాల హాట్‌స్పాట్లలో ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 10 రోజులపాటు 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఆపరేషన్‌ను నిర్వహించి.. 104 మంది సైబర్‌ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిపై దేశవ్యాప్తంగా 1055 సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదైనట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు రూ.127 కోట్లు కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని, ఇది దేశంలోనే అతిపెద్ద ఆపరేషన్‌ అని తెలిపారు. అరెస్టు చేసిన వారిలో.. అక్రమ సొమ్మును దాచడానికి కమీషన్‌ తీసుకొని బ్యాంక్‌ ఖాతాలను అందజేసిన 86 మంది కూడా ఉన్నారని చెప్పారు. నేరగాళ్లతో కుమ్మక్కై నకిలీ ఖాతాలను తెరవడంలో సహకరించిన బంధన్‌ బ్యాంక్‌కు చెందిన రిలేషన్‌షి్‌ప మేనేజర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రత్యేకంగా అభినందించారు.

ఆపరేషన్‌ ఆక్టోపస్‌ నిరంతర ప్రక్రియ: సీపీ సజ్జనార్‌

సైబర్‌ నేరాల పట్ల హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఆపరేషన్‌ ఆక్టోపస్‌ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. నేరగాళ్లు ఎక్కడున్నా పట్టుకుంటామని, అంతర్రాష్ట్ర నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. చట్టాన్ని అతిక్రమించే బ్యాంక్‌ అధికారులు సహా ఎవరినీ వదిలిపెట్టబోమని పేర్కొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 01:17 AM