Share News

ఎవరికీ తాడిచర్ల-2కేటాయించలేదు

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:54 AM

ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వ రంగ సంస్థకూ తాడిచర్ల-2 బొగ్గుగనిని కేటాయించలేదని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఎవరికీ తాడిచర్ల-2కేటాయించలేదు

  • కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

  • నీతి ఆయోగ్‌ కమిటీ సిఫారసుల మేరకే నిర్ణయం

  • 2015 ఆగస్టు 31న తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థకు తాడిచర్ల-1 కేటాయింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వ రంగ సంస్థకూ తాడిచర్ల-2 బొగ్గుగనిని కేటాయించలేదని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2020- జూన్‌ తర్వాత ఏ ప్రభుత్వ రంగ సంస్థకూ బొగ్గుబ్లాక్‌లు కేటాయించలేదని సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్‌ సభ్యుడు ఎం అనిల్‌కుమార్‌ యాదవ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2019 మార్చి 29న నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు వాణిజ్య ప్రయోజనాల రీత్యా గనుల తవ్వకాలు, మైనింగ్‌ సంబంధిత రాయితీలను మళ్లించాలని నిర్ణయించామన్నారు. దీని ప్రకారం 2020 జూన్‌ నుంచి వాణిజ్య ప్రయోజనాల రీత్యా మాత్రమే అన్ని గనుల వేలం, కేటాయింపులు జరగాలని నిర్ణయించినట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత నేరుగా బొగ్గు గనులు, బ్లాక్‌ల వేలం నిలిపేసినట్లు తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ నేరుగా గనులను కేటాయిస్తుందన్న కిషన్‌ రెడ్డి.. ఈ బొగ్గు బ్లాక్‌ల వేలంలో ప్రభుత్వ సంస్థలూ పాల్గొనవచ్చునన్నారు. 2015 ఆగస్టు 31న తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్త సంస్థకు కేటాయించిన తాడిచర్ల-1 బొగ్గు గనిలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. 2020 జూన్‌ నుంచి 13 రౌండ్ల పాటు బొగ్గు బ్లాక్‌ల వేలం జరగ్గా.. 136 బొగ్గు బ్లాక్‌లను విజయవంతంగా కేటాయించామన్నారు. భౌగోళిక ఇబ్బందులు, తక్కువ గ్రేడ్‌ బొగ్గు, మౌలిక వసతుల లేమి, డిమాండ్‌ లేకపోవడం వల్ల 174 బొగ్గు బ్లాక్‌లను ఇంత వరకూ కేటాయించలేదని కిషన్‌ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడిలో 2 సెక్టార్లు, సోమవరానికి చెందిన 3 సెక్టార్లు, తెలంగాణలో కల్యాణ్‌ ఖని బ్లాక్‌-6, పెనగడప, శ్రావణపల్లి బ్లాక్‌లనూ కేటాయించవల్సి ఉందన్నారు.


వేలంలోనే వికారాబాద్‌లోని 2 సున్నపురాయి బ్లాక్‌ల కేటాయింపు

వికారాబాద్‌ జిల్లాలోని 2 సున్నపురాయి బ్లాక్‌లను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించాలని 2024 మార్చి 11న కోరిందని అనిల్‌ కుమార్‌ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా కిషన్‌రెడ్డి చెప్పారు. 680/753 హెక్టార్లలో వేర్వేరుగా ఉన్న బ్లాక్‌లను వేలం వేయడానికి నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. వీటి వేలంలో తెలంగాణ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ కూడా పాల్గొనాలని ప్రోత్సహించామన్నారు. 2015లో ఎంఎండీఆర్‌ చట్టానికి సవరణ తర్వాత వేలం విధానం అమల్లోకి తెచ్చామన్న కిషన్‌ రెడ్డి.. నాటి నుంచి తాము 197 ఖనిజ బ్లాక్‌లను వేలం వేస్తే.. తెలంగాణ సర్కారు కేవలం 4 సున్నపు రాయి బ్లాక్‌లను వేలం వేసిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా వికారాబాద్‌ ఖనిజ బ్లాక్‌లను వేలం వేస్తే ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. దీంతో ఉత్పత్తి ప్రారంభం కావడంతోపాటు పారిశ్రామిక కార్యకలాపాల పెరుగుదలతో సామాజిక, ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. ఖనిజ బ్లాక్‌ల వేలంతో ఉపాధి కల్పన, సర్కారు ఆదాయం పెరుగుతుందని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్లుగా దేశమంతా బొగ్గు ఉత్పత్తి ఐదేళ్లుగా పెరుగుతూనే ఉందన్నారు. 2019-20లో 730.87 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తయితే 2024-25లో 781.06 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని వివరించారు. 2029-30 నాటికి బొగ్గు ఉత్పత్తి 1.5 బిలియన్‌ టన్నులకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. 2019-2020లో సింగరేణిలో 64.4 మెట్రిక్‌ టన్నులకు ఉత్పత్తి చేరితే 2024-25లో 69.01 మెట్రిక్‌ టన్నులకు చేరుతుందని జార్ఖండ్‌ బీజేపీ ఎంపీ ప్రదీప్‌ కుమార్‌ వర్మ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Updated Date - Feb 03 , 2026 | 02:54 AM