Share News

వెయ్యి కోట్ల బాండ్‌కు 100 కోట్ల ప్రోత్సాహం

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:08 AM

భారీగా పెరిగిపోతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు నిధులు లేక నీరసించిపోతున్న దేశంలోని నగరాలు, పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.

వెయ్యి కోట్ల బాండ్‌కు 100 కోట్ల ప్రోత్సాహం

  • మునిసిపల్‌ బాండ్లపై కీలక ప్రకటన

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 1(ఆంధ్ర జ్యోతి): భారీగా పెరిగిపోతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు నిధులు లేక నీరసించిపోతున్న దేశంలోని నగరాలు, పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. మౌలిక వసతుల కల్పన కోసం పురపాలక సంస్థలు రూ.1,000 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తానికి జారీచేసే ఏకమొత్తం బాండ్లపై రూ.100 కోట్లు ప్రోత్సాహకంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీతోపాటు వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ వంటి పురపాలక సంస్థలు బాండ్ల జారీ ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. పెద్ద నగరపాలక సంస్థలు అధిక విలువ గల మునిసిపల్‌ బాండ్లు జారీ చేయడాన్ని ప్రొత్సహించేందుకు, తద్వారా మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. చిన్న నగరపాలక సంస్థలకు కూడా కేంద్రం తీపి కబురు తెలిపింది. రూ.200 కోట్ల వరకు బాండ్లు జారీచేసే చిన్న, మధ్య తరహా మునిసిపాలిటీలకు అమృత్‌ పథకం కింద మద్దతు ఉంటుందని ప్రకటించింది. ప్రభుత్వ నిధులపైౖ ఆధారపడకుండా మునిసిపాలిటీలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అఽధికారులు చెబుతున్నారు.

మునిసిపల్‌ బాండ్‌ అంటే..?

తన పరిధిలో అభివృద్ధి పనుల కోసం పురపాలక సంస్థ బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పు తీసుకొనేందుకు జారీ చేసే పత్రాన్నే మునిసిపల్‌ బాండ్‌ అంటారు. బాండ్ల ద్వారా నిధులు సేకరించాలంటే సెబీ అనుమతి ఉండాలి. నగరపాలక సంస్థ జారీ చేసిన ఈ బాండ్లను బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎల్‌ఐసీ లాంటి సంస్థలు, పెద్ద పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తారు. తీసుకున్న నగదుకు నగరపాలక సంస్థ వడ్డీ చెల్లిస్తుంది. బాండ్‌ గడువు ముగిసిన తరువాత అసలు కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాండ్ల మెచ్యూరిటీ గడువు సాధారణంగా 5 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ బాండ్లలో పలు రకాలుంటాయి. 2018-19లో జీహెచ్‌ఎంసీ మూడు విడతలుగా రూ.495 కోట్లకు బాండ్లు జారీ చేసింది.

Updated Date - Feb 02 , 2026 | 03:08 AM