మదర్ డెయిరీని భ్రష్టు పట్టించిన జితేందర్ రెడ్డి
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:58 AM
మదర్ డెయిరీకి 13 ఏళ్లు చైర్మన్‌గా ఉన్న గుత్తా జితేందర్ రెడ్డి సంస్థను భ్రష్టు పట్టించారని ప్రస్తుత చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి విమర్శించారు.
ఢిల్లీ డెయిరీతో ఒప్పందం కోసం చర్చిస్తున్నాం
మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి
హయత్‌నగర్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మదర్ డెయిరీకి 13 ఏళ్లు చైర్మన్‌గా ఉన్న గుత్తా జితేందర్ రెడ్డి సంస్థను భ్రష్టు పట్టించారని ప్రస్తుత చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి విమర్శించారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లో ఉన్నట్లు చూపించి, దానికి దొంగ ఆడిట్ చేయించి ఆదాయ పన్ను కట్టించిన ఘనుడు జితేందర్ రెడ్డి అని ఆరోపించారు. రూ.70 కోట్ల నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే ఆ నష్టాలకు కారణమైన జితేందర్ రెడ్డి.. జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ) అధికారులు రాకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మధుసూదన్ రెడ్డి ఐదుగురు పాలకవర్గం సభ్యులతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పాలకవర్గంపై జితేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వంతో మాట్లాడి రూ.35కోట్లు ఇప్పిస్తానంటూ జితేందర్‌రెడ్డి రైతులకు అబద్ధంచెప్పి సంతకాల సేకరణ చేశారన్నారు. రూ.35 కోట్లు రైతులు, ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తే తామే రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. చిట్యాలలో ఎకరా భూమి రూ.5 లక్షల చొప్పున కొని రూ.16 లక్షలకు కొన్నట్లు లెక్కలు చూపించారన్నారు. ఆ సొమ్ముతో 150 ఎకరాల భూమి వచ్చేదన్నారు. సాక్ష్యాధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 2023లో తాను చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మదర్ డెయిరీ రూ.35 కోట్లు నష్టాల్లో ఉండ గా రూ.కోటీ 85 లక్షల లాభాల్లో ఉన్నట్లు చూపించి రూ.43 లక్షలు ఐటీ కట్టించారన్నారు. ఢిల్లీ డెయిరీతో ఒప్పందానికి ప్రయత్నిస్తున్నామని, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం గ్రాంటు ఇస్తుందా లేక ఎన్‌డీడీబీకి అప్పగిస్తుందా అనేది 15వ తేదీకల్లా తేలుతుందన్నారు. ఉద్యోగుల వేతనాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.