మదర్ డెయిరీ చైర్మన్‌గా మళ్లీ మధుసూదన్‌రెడ్డి
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:16 AM
నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్మాక్స్ మదర్ డెయిరీ) చైర్మన్‌గా మరో సారి గుడిపాటి మధుసూదన్‌రెడ్డి ఎన్నికయ్యారు.
కొత్త ఇన్‌చార్జి ఎండీగా అబ్దుల్ గఫార్
హయత్‌నగర్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్మాక్స్ మదర్ డెయిరీ) చైర్మన్‌గా మరో సారి గుడిపాటి మధుసూదన్‌రెడ్డి ఎన్నికయ్యారు. మదర్ డెయిరీలో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో 14 మంది పాలకవర్గం సభ్యులు తిరిగి మధుసూదన్‌రెడ్డినే చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎనుకున్నారు. రైతులకు చెల్లించాల్సిన రూ.12కోట్ల పెండింగ్ పాల బిల్లులను పాలకవర్గంలోని వారెవరైనా చెల్లించడానికి ముందుకొస్తే తాను రాజీనామా చేస్తానని మధుసూదన్‌రెడ్డి ప్రకటించగా... డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ముందుకొచ్చారు. దీంతో జనవరి 8న మధుసూదన్‌రెడ్డి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అదే రోజు చైర్మన్‌గా ఎన్నికైన ప్రభాకర్‌రెడ్డి.. డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి రూ.3కోట్లను రైతులకు చెల్లించారు. మిగతా బకాయిలను చెల్లించాలని పాలకవర్గం సభ్యులు ఒత్తిడి పెంచడంతో తన ఆరోగ్యం సహకరించడం లేదని పేర్కొంటూ జనవరి 23న ఆయన రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా బుధవారం మదర్ డెయిరీలో 15 మంది పాలకవర్గం సభ్యులు సమావేశమై, తిరిగి మధుసూదన్‌రెడ్డినే చైర్మన్‌గా ఎన్నుకున్నారు. మరోవైపు.. మదర్ డెయిరీ ఇన్‌చార్జి ఎండీగా కొనసాగుతున్న కృష్ణ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. దీంతో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ఇన్‌చార్జి ఎండీగా అబ్దుల్ గఫార్‌ను నియమించారు.