మూసీ ఫేజ్-1కు 5,900 కోట్లు?
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:23 AM
మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులో ఫేజ్-1ను రూ.5,900 కోట్లతో చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. ఫేజ్-1కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక .....
అంచనాలు సిద్ధం చేస్తున్న అధికారులు!
హిమాయత్‌సాగర్-బాపూఘాట్, గండిపేట -బాపూఘాట్ అభివృద్ధి
భారీ గాంధీ విగ్రహం, మ్యూజియం, విజ్ఞాన కేంద్రం
తుది దశకు చేరిన డీపీఆర్ పనులు
13న వివరాలు వెల్లడించనున్న ప్రభుత్వం
హైదరాబాద్ సిటీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులో ఫేజ్-1ను రూ.5,900 కోట్లతో చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. ఫేజ్-1కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తుది దశకు చేరింది. మూసీ, ఈసా నదులు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించే ప్రాంతం నుంచి లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వరకు ఇరువైపులా అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నారు. బాపూ ఘాట్ వద్దే గాంధీ సరోవర్ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నారు. అక్కడే భారీ గాంధీ విగ్రహం, మ్యూజియం, విజ్ఞా న కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. మూసీ రీవర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై మంత్రులు, నగరానికి చెందిన ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల తో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 13న పూర్తిస్థాయిలో చర్చించి వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మూసీ నదిని పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డు (నార్సింగి) నుంచి తూర్పున ఔటర్ రింగ్ రోడ్డు (గౌరెల్లి) వరకు.. ఇరువైపులా 110 కిలోమీటర్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మూసీ నదిని పునరుజ్జీవం చేసే ఈ ప్రాజెక్టుపై సాధ్యాసాధ్యాల అధ్యయనం పూర్తయింది. ఈ ప్రాజెక్టు కింద మురుగునీటి శుద్ధి, వర్షపు నీరు మురుగు కలిసి వెళ్లకుండా చర్యలు, ల్యాండ్‌స్కేప్ అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాలు, పీపీపీ పద్ధతిలో వివిధ రకాల ప్రా జెక్టులను తీసుకొచ్చేందుకు అనుకూలమైన అంశాలను ప్రణాళికలోకి తీసుకున్నారు. మూసీ నదిని ఒకేసారి 55 కిలోమీటర్ల మేర కాకుండా విడతల వారీగా చేపట్టేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా మూసీ రీవర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-1కు ప్రణాళికలు తుదిదశకు చేరాయి. ఫేజ్-1లోనే హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.2 కి.మీ.; ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.8 కిలోమీటర్లు అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్-1లో పన్నులు, ఇతరత్రా చెల్లింపుల కోసమే రూ.1596 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఫేజ్-1లో భాగంగా ప్యాకేజీ-1 కింద హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.2 కి.మీ. పొడవునా ఇరువైపులా 50 అడుగల బఫర్‌జోన్ పరిధిలో రూ.1,684 కోట్లతో అభివృద్ధి చేయడానికి అంచనాలు రూపొందిస్తున్నారు. ప్యాకేజీ-2 కింద ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.8 కి.మీ. పొడవునా ఇరువైపులా 50 అడుగుల బఫర్‌జోన్ పరిధిలో రూ.1,992 కోట్లతో అభివృద్ధి చేయడానికి అంచనాలు వేసినట్లు తెలిసింది. అయితే ఈసా, మూసీ నదుల సంగమం వద్ద బాపూఘాట్‌లో గాంధీ సరోవర్ ప్రాజెక్టునూ చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భారీ గాంధీ విగ్రహానికి రూ.70 కోట్లు, విజ్ఞాన కేంద్రం, ఆ ప్రాంత అభివృద్ధికి మొత్తంగా రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.