ఉపాధి హామీకి 40 శాతం నిధులు!
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:24 AM
పేరు మార్చినా ఉపాధి హామీ పథకం కొనసాగుతోందని, దానికి రాష్ట్ర వాటా కింద బడ్జెట్లో ఈసారి 40 శాతం నిధులను కేటాయించాల్సి ఉంటుందని మంత్రి సీతక్క కోరారు. పూర్తిగా పేదల కోసం ఉద్దేశించిన పథకమని.....
కేంద్రం కోతలను భర్తీ చేసేలా కేటాయింపులుండాలి.. ప్రభుత్వ భవనాల శాశ్వత నిర్మాణాలకు నిధులివ్వండి
ఆర్డీవో, తహసీల్దార్, పంచాయతీ కార్యాలయాలకు కూడా
బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో మంత్రులు పొంగులేటి, సీతక్క
తహసీల్దార్, ఎంపీడీవో భవనాలు ఒకేచోట నిర్మించండి: భట్టి
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పేరు మార్చినా ఉపాధి హామీ పథకం కొనసాగుతోందని, దానికి రాష్ట్ర వాటా కింద బడ్జెట్లో ఈసారి 40 శాతం నిధులను కేటాయించాల్సి ఉంటుందని మంత్రి సీతక్క కోరారు. పూర్తిగా పేదల కోసం ఉద్దేశించిన పథకమని, దీనికి కేంద్ర ప్రభుత్వం కోతలు విధిస్తోందని, ఆ లోటును భర్తీ చేసే విధంగా ఈ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించాలని వివరించారు. ఉపాధి అవకాశాలు తగ్గకుండా అవసరమైన నిధులు కేటాయించి పథకం కొనసాగేలా చూడాలన్నారు. సచివాలయంలో మంగళవారం వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సన్నాహక సమావేశాలు జరిగాయి. ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వివేక్ పాల్గొన్నారు. బడ్జెట్‌లో తమ శాఖలకు ప్రతిపాదించిన మేర నిధులివ్వాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించామని, వీటికి నిధుల కేటాయింపు ఉండాలని తెలిపారు. కొత్త బడ్జెట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీవో, తహసిల్దార్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించామని, వీటికి నిధులను కేటాయించాలని మంత్రులు పొంగులేటి, సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాబోయే మూడేళ్లలో గ్రామ పంచాయతీలన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు, ప్రణాళికను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
స్థలాలు అందుబాటులో ఉన్న చోట తహసిల్దార్, ఎంపీడీఓ కార్యాలయ భవనాలను కలిపి నిర్మించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పట్టణాల్లో రహదారులపై కొంతమంది చంటి బిడ్డలను పెట్టుకుని యాచక వృత్తిని కొనసాగిస్తున్నారని, వారందరినీ శిశు విహార్‌లలో చేర్పించాలని నిర్దేశించారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. సర్కారుతో ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలకు అనుగుణంగా వీటిని రూపొందించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక వెలికితీత ట్రైబల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే జరగాలని, వాటికి ఐటీడీఏల నుంచి పూర్తి సహకారాన్ని అందించాలని ఆదేశించారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించడానికి రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు రానున్నామని చెప్పారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, అత్యాధునిక ‘రోవర్’ పరికరాలతో భూముల సర్వేను చేపడతామన్నారు. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున 460 రోవర్లను కొనుగోలు చేశామని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో మరో 400 రోవర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, వీటికి నిధులివ్వాలని కోరారు.