Share News

మంత్రి నివాసం మరమ్మతులకు రూ.76 లక్షలు

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:33 AM

మంత్రుల నివాస సముదాయంలోని ఓ భవనానికి మరమ్మతుల కోసం రూ.76 లక్షలు కేటాయించారు. ఆ మేరకు పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ ఆర్‌అండ్‌బీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మంత్రి నివాసం మరమ్మతులకు రూ.76 లక్షలు

  • వాస్తు ప్రభావంతో ఏళ్ల తరబడి ఖాళీగా క్వార్టర్‌ నం.29

  • తాజాగా మంత్రి అజారుద్దీన్‌కు కేటాయింపు

  • బాత్రూమ్‌లకే 76 లక్షలంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు!

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మంత్రుల నివాస సముదాయంలోని ఓ భవనానికి మరమ్మతుల కోసం రూ.76 లక్షలు కేటాయించారు. ఆ మేరకు పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ ఆర్‌అండ్‌బీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్వార్టర్‌ నంబరు 29 దాదాపు 15 ఏళ్లుగా ఖాళీగా ఉంది. వాస్తు ప్రభావంతో ఉమ్మడి ఏపీ సమయం నుంచీ ఇది ఎక్కువగా ఖాళీగానే ఉంటోంది. ఈ భవనంలో ఉండేందుకు మంత్రులు ఆసక్తి చూపకపోవడంతో ఏళ్ల తరబడి ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరింది. తాజాగా ఈ భవనాన్ని మంత్రి అజారుద్దీన్‌కు కేటాయించారు. ఈ క్రమంలో క్వార్టర్‌ నంబరు 29కి భారీగా మరమ్మతులు అవసరమని ఆర్‌అండ్‌బీ సీఈ ప్రతిపాదనలు సమర్పించారు. భవనం రూఫ్‌ స్లాబ్‌లో వాటర్‌ ప్రూఫింగ్‌, ఫ్లోర్‌ టైల్స్‌, యూపీవీసీ కిటికీలు, మాడ్యులర్‌ కిచెన్‌, హాల్‌, బెడ్‌రూమ్‌ల్లో కప్‌ బోర్డులు, గోడలకు మరమ్మతులు, పెయింటింగ్‌ సహా చాలా మరమ్మతులు చేయాల్సి ఉందని తేల్చారు. సీఈ ప్రతిపాదనల మేరకు రూ.76 లక్షలకు పాలనా అనుమతులు ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, సోషల్‌ మీడియాలో మాత్రం మంత్రికి కేటాయించిన క్వార్టర్‌ నంబరు 29లోని బాత్రూమ్‌ మరమ్మతుల కోసమే రూ.76 లక్షలు ఖర్చు చేస్తున్నారన్నట్లుగా పోస్టులు వైరల్‌ అయ్యాయి.

Updated Date - Jan 29 , 2026 | 05:33 AM