Share News

ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే అహ్మద్‌పాషా ఖాద్రీ కన్నుమూత

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:16 AM

ఎంఐఎం సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే అహ్మద్‌పాషా ఖాద్రీ (72) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు

ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే అహ్మద్‌పాషా ఖాద్రీ కన్నుమూత

మదీన, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఎంఐఎం సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే అహ్మద్‌పాషా ఖాద్రీ (72) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. రెండేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 6 నెలలుగా డయాలసిస్‌పై కొనసాగుతున్న ఖాద్రీ పరిస్థితి విషమించడంతో కిషన్‌బాగ్‌లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్లు ఎంఐఎం వర్గాలు తెలిపాయి. ఆయన మృతి వార్త తెలియగానే పలువురు కార్పొరేటర్లు, ఎంఐఎం నేతలు, కార్యకర్తలు ఖాద్రీ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఖాద్రీకి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే ఖాద్రీ భార్య కూడా మృతిచెందారు. ఖాద్రి 2004, 2009, 2014 ఎన్నికల్లో చార్మినార్‌, 2018లో యాకుత్‌పురా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1986లో జరిగిన హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో డబీర్‌పురా కార్పొరేటర్‌గా గెలుపొందిన పాషా ఖాద్రీ.. అంచెలంచెలుగా ఎదిగారు. దివంగత సుల్తాన్‌ సలావుద్దీన్‌కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడనే పేరుంది.

Updated Date - Feb 04 , 2026 | 03:16 AM