‘మైక్రో బ్రూవరీస్’లో కాంగ్రెస్ స్కామ్!
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:21 AM
క్సైజ్ శాఖలో మైక్రో బ్రూవరీస్ పేరిట కాంగ్రెస్ నేతలు భారీ స్కామ్‌కు తెగబడ్డారని బీఆర్‌ఎస్ నేత టి.హరీశ్‌రావు ఆరోపించారు. అధికార పార్టీలోని ముఖ్యనేతకు నిత్యం నీడలా ఉండే వ్యక్తి ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా మైక్రో బ్రూవరీలను కేటాయించి.....
రూ.కోట్ల వసూళ్లకు తెగబడ్డ ముఖ్యనేత.. ఆయన నీడ
ముఖ్యనేత, ఆయన నీడకు 21, మంత్రి కనుసన్నల్లో 4
డ్రా విధానాన్ని పాటించలేదు.. మీడియాతో చిట్‌చాట్‌లో హరీశ్
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రూవరీస్ పేరిట కాంగ్రెస్ నేతలు భారీ స్కామ్‌కు తెగబడ్డారని బీఆర్‌ఎస్ నేత టి.హరీశ్‌రావు ఆరోపించారు. అధికార పార్టీలోని ముఖ్యనేతకు నిత్యం నీడలా ఉండే వ్యక్తి ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా మైక్రో బ్రూవరీలను కేటాయించి.. రూ.కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు. తన కారును నేరుగా ముఖ్యనేత ఇంట్లోకి తీసుకువెళ్లేంత చొరవ ఉండే ఈ నాయకుడు.. ముఖ్యనేత ఎక్కడికి వెళ్లినా వెంట ఉంటారని, ఆయన ద్వారానే ఆబ్కారీ శాఖ వేదికగా అవినీతి పర్వం కొనసాగుతోందని అన్నారు. ఈ మేరకు హరీశ్‌రావు బుధవారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఇప్పటికే హోలోగ్రామ్ టెండర్ల విషయంలో ముఖ్యనేత అల్లుడికి, ఓ మంత్రి కొడుక్కి కాంట్రాక్టు దక్కాలని పట్టుబట్టడంతో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 25 మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించగా.. 110 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. వీటి నుంచి లాటరీ పద్ధతిన ఎంపిక చేయాల్సి ఉండగా.. దానిని పాటించలేదని తెలిపారు. డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా 4 మైక్రో బ్రూవరీలను మంత్రికి కేటాయించి, మిగిలిన 21 మైక్రోబ్రూవరీలను ముఖ్యనేతకు నీడగా ఉండే వ్యక్తి తన కోటాగా మార్చుకున్నారని ఆరోపించారు. ఒక్కో మైక్రో బ్రూవరీకి రూ.1.80 కోట్లు వసూలు చేసి.. అందులో ముఖ్యనేతకు రూ.కోటిన్నర, నీడకు రూ.30 లక్షలు వాటాగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
పంపకాల్లో తేడాతో బకాయిలు చెల్లించడంలేదు
రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు ప్రభుత్వం రూ.4500 కోట్లు బకాయి పడిందని హరీశ్‌రావు అన్నారు. కొన్ని బకాయిలు 16 నెలలకు పైబడి ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ నేతల వాటాలు, పంపకాల్లో తేడా కారణంగానే ఈ బకాయిలు నిలిచిపోయాయని ఆరోపించారు. సర్కారు నిర్వాకంతో రాష్ట్రంలో బ్రీజర్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామంటూ హెచ్చరించాయని, మరికొన్ని బ్రాండ్స్ నిలిపివేేస పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇక ఈ ప్రభుత్వం బీరు కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యం రైతులకు ఇవ్వడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులు వేసే పంటలకు నీళ్లివ్వకుండా ఎడారిగా మారుస్తూ.. బీరు కంపెనీలకు మాత్రం సమృద్ధిగా నీళ్లు అందిస్తున్నారని ఆరోపించారు. ఇందులో కూడా ముఖ్యనేత హస్తం ఉందన్నారు.