Share News

అనుమతులివ్వకముందే వసూళ్లంటారా?

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:19 AM

రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం ఇంకా అనుమతులే ఇవ్వలేదని, అందుకు సంబంధించిన ఫైలు కూడా తన వద్దకు రాలేదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

అనుమతులివ్వకముందే వసూళ్లంటారా?

  • మైక్రో బ్రూవరీలపై జీవో బీఆర్‌ఎస్‌ తెచ్చిందే.. నాటి విధి విధానాలనే మేం అనుసరిస్తున్నాం

  • ఆనాడు లాటరీ లేకుండానే 20 మందికి అనుమతులు

  • బీఆర్‌ఎస్‌ హయాంలో 3,500 కోట్ల ఎక్సైజ్‌ బకాయిలు

  • ఆర్థికశాఖలో 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌

  • అప్పటి పైపులైన్ల ద్వారానే బీర్ల కంపెనీలకు నీళ్లు

  • వారి దోపిడీని చూడలేకే పార్టీ నుంచి బయటికొచ్చాను

  • మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం ఇంకా అనుమతులే ఇవ్వలేదని, అందుకు సంబంధించిన ఫైలు కూడా తన వద్దకు రాలేదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అప్పుడే వీటిలో వాటాలు, వసూళ్లంటూ తప్పుడు ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు. మైక్రో బ్రూవరీల కేటాయింపులో కాంగ్రెస్‌ నేతలు కుంభకోణానికి పాల్పడ్డారంటూ బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్‌లో చేసిన ఆరోపణల్ని మంత్రి జూపల్లి ఖండించారు. బుధవారం రవీంద్ర భారతి వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలోనే మైక్రో బ్రూవరీలకు సంబంధించి విధి విధానాలను రూపొందిస్తూ 2015లో జీవో నంబర్‌ 151 జారీ చేశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 50 దరఖాస్తులు వస్తే.. లాటరీ లేకుండా 20 మందికి వారికి నచ్చినట్లు అనుమతులిచ్చారని, ఇప్పుడు తాము అవే నిబంధనలు పాటిస్తుంటే మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘నేను కొత్తగా ఒక్క ఫైలుపై కూడా సంతకం చేయలేదు. తప్పులన్నీ మీరు చేసి.. ఇప్పుడు మా ప్రభుత్వంపై బురద చల్లుతారా? సిగ్గుండాలి’’ అని జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారాలూ లేకుండానే అవినీతి అంటూ హరీశ్‌రావు మాట్లాడటం తగదన్నారు. రాష్ట్రాన్ని తాగుబోతుల అడ్డాగా బీఆర్‌ఎస్‌ మార్చిందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చేనాటికి ఎక్సైజ్‌ ఆదాయం రూ.10,012 కోట్లు ఉంటే, 2023 నాటికి దానిని రూ.34,869 కోట్లకు పెంచారని తెలిపారు. ‘‘తొమ్మిదేళ్లలో ఎక్సైజ్‌ ఆదాయాన్ని రూ.25 వేల కోట్లు పెంచింది మీరు కాదా? మా ప్రభుత్వంలో ఆదాయం పెరగకపోగా.. గతేడాది కంటే రూ.250 కోట్లు తగ్గింది.


దీనిని బట్టి రాష్ట్రాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చిందెవరో అర్థమవుతుంది’’ అని జూపల్లి వ్యాఖ్యానించారు. ప్రతి 15 రోజులకోసారి బకాయిలు చెల్లించామంటూ హరీశ్‌రావు గొప్పలు చెప్పుకొంటున్నారని, అలాంటప్పుడు గత ప్రభుత్వంలో రూ.3,500 కోట్ల ఎక్సైజ్‌ బకాయిలు ఎలా మిగిల్చారో చెప్పాలని అన్నారు. కేవలం ఎక్సైజ్‌ శాఖకే కాకుండా.. ఆర్థికశాఖలో వివిధ పనులకు సంబంధించి మరో రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. ‘‘నీకంత.. నాకింత.. అన్నట్లుగా వాటాలు పంచుకుంది బీఆర్‌ఎస్‌ నేతలే. వారి దోపిడీ, దౌర్జన్యాలు చూడలేకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను’’ అని జూపల్లి తెలిపారు. మునిసిపల్‌ ఎన్నిక కోసం అబద్ధాలతో రాజకీయం చేస్తున్నారని, దమ్ముంటే ఆస్తులు, వాటాలపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. సింగూరు జలాలను బీర్ల కంపెనీలకు తరలిస్తున్నారన్న ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పైపులైన్ల ద్వారానే నీరు వెళుతోందని, కొత్తగా తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

Updated Date - Jan 29 , 2026 | 05:19 AM