Share News

‘అత్యంత ప్రమాదకరం’ కేటగిరీలో మేడిగడ్డ

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:46 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 ప్రకారం దేశంలో పలు కేటగిరీలవారీగా డ్యామ్‌లు ఉండగా..

‘అత్యంత ప్రమాదకరం’ కేటగిరీలో మేడిగడ్డ

  • జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021లోనికేటగిరీ-1లో చేర్చిన డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ

  • లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర జలశక్తి శాఖ

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 ప్రకారం దేశంలో పలు కేటగిరీలవారీగా డ్యామ్‌లు ఉండగా.. అందులో కేటగిరీ-1(అత్యంత ప్రమాదకర జాబితా)లో మేడిగడ్డను కేంద్ర జలశక్తి శాఖ చేర్చింది. 2025 వరదల అనంతరం స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎస్‌డీఎ్‌సఏ) నేతృత్వంలో ప్రాజెక్టు ఓనర్‌ (చీఫ్‌ ఇంజనీర్‌) ఈ నివేదికను సిద్ధం చేసి, కేంద్రానికి అందించారు. ఆ నివేదిక ఆధారంగా మేడిగడ్డను అత్యంత ప్రమాదకర జాబితాలో చేర్చారు. మేడిగడ్డకు ఎన్‌డీఎ్‌సఏ సూచించిన మరమ్మతులు, రక్షణ చర్యలను తక్షణం చేపట్టాలని.. నిర్లక్ష్యం చేస్తే బ్యారేజ్‌ భద్రతకే ముప్పు ఏర్పడే ప్రమాదముందని కేంద్రం హెచ్చరించింది. కేటగిరీ-1లో దేశవ్యాప్తంగా కేవలం మూడు డ్యామ్‌లు మాత్రమే ఉండగా... అందులో మేడిగడ్డ ఒకటి కావడం గమనార్హం. మిగతా రెండూ.. లోయర్‌ ఖజూరి డ్యామ్‌ (యూపీ), బోకారో బ్యారేజీ (ఝార్ఖండ్‌). వీటిలో లోయర్‌ ఖజూరి డ్యామ్‌ నిర్మాణం 1937లో జరిగింది. ఇక, ఝార్ఖండ్‌లోని బొకారో డ్యామ్‌ను 73 ఏళ్ల క్రితం కట్టారు. బొకారో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ అవసరాల కోసం దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ దీన్ని 1953లో నిర్మించింది. మేడిగడ్డ బ్యారేజీ విషయానికి వస్తే.. దాని నిర్మాణం 2016లో ప్రారంభమై, 2019 మే నెలలో పూర్తయింది. నిర్మించిన నాలుగేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు(11 పిల్లర్లు ఉన్నది) కుంగిపోయింది. బ్లాకు కింద ఉన్న ఇసుక అంతా జారీ పోవడమే దీనికి కారణమని గుర్తించారు. దేశంలో 50 ఏళ్లు దాటిన డ్యామ్‌లు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఎన్ని ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి? అంటూ.. టీడీపీ ఎంపీలు డాక్టర్‌ జి.లక్షీనారాయణ, బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా భాగంగా కేంద్ర జలశక్తి శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. దేశంలో 50 ఏళ్లకు పైబడిన డ్యాములు 1681 ఉన్నాయి. వాటిలో 216 డ్యాములు కేటగిరీ-2లో (ప్రధాన లోపాలున్నవి) ఉన్నాయి. అందులో 69 డ్యాములు 50ఏళ్లకు పైబడినవి. ఏపీకి చెందిన డ్యాములేవీ ఈ జాబితాలో లేవు. కాగా.. మేడిగడ బ్యారేజీ వైఫల్యానికి గల కారణాలు, వాటిని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స-పూణే) ప్రస్తుతం పరీక్షలు చేస్తోంది. ఇప్పటికే బ్యారేజీ పునరుద్ధరణ డిజైన్లు అందించడానికి ఆఫ్రీ ఇండియా(ముంబై) సంస్థను ప్రభుత్వం ఎంపిక కూడా చేసింది. ఆ సంస్థతో ఒప్పందం జర గాల్సి ఉంది.

Updated Date - Jan 30 , 2026 | 03:46 AM