Share News

550 పడకలు, 5 సెకన్లలో హార్ట్‌ స్కానింగ్‌

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:57 AM

హైదరాబాద్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా నిర్మించిన మెడికవర్‌ ఆస్పత్రి గురువారం ప్రారంభమైంది. దీంతో దేశంలో ఉన్న మెడికవర్‌ ఆస్పత్రుల సంఖ్య 25కి చేరిందని ఆ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

550 పడకలు, 5 సెకన్లలో హార్ట్‌ స్కానింగ్‌

  • హైదరాబాద్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్‌ ఆస్పత్రి ప్రారంభం

  • అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి

  • దేశంలో 25వ మెడికవర్‌ ఆస్పత్రి

హైదరాబాద్‌ సిటీ, మార్చి 12 : హైదరాబాద్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా నిర్మించిన మెడికవర్‌ ఆస్పత్రి గురువారం ప్రారంభమైంది. దీంతో దేశంలో ఉన్న మెడికవర్‌ ఆస్పత్రుల సంఖ్య 25కి చేరిందని ఆ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభించిన ఆస్పత్రి దేశంలోనే అత్యంత ఎత్తైన ఆసుపత్రి భవనాలలో ఒకటని వెల్లడించాయి. 550 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సాంకేతికత, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆస్పత్రిలో 5 క్షణాల్లో గుండె స్కానింగ్‌ పూర్తి చేసే అత్యాధునిక హార్ట్‌ స్కానింగ్‌ టెక్నాలజీని మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా 640 - స్లైస్‌ సీటీ స్కాన్‌ సాంకేతికతను ఏర్పాటు చేసి మరింత స్పష్టమైన చిత్రీకరణతో వేగవంతమైన మరియు ఖచ్చితమైన నిర్ధారణకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మెడికవర్‌ ఆస్పత్రుల ఎండీ జీ అనిల్‌ కృష్ణ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. మెడికవర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ రెడ్డి మాట్లాడుతూ, 640 -స్లైస్‌ సీటీ స్కాన్‌, వేగవంతమైన హార్ట్‌ స్కానింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతలతో ఖచ్చితమైన నిర్ధారణ చేసి రోగులకు సమయానికి చికిత్స అందించగలమన్నారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి. హరికృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ స్థాయి వైద్య సేవల అవసరం పెరుగుతోందని, ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశామన్నారు. డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.ఆర్‌. కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ఆధునిక వైద్య పరికరాలు, సమగ్ర వైద్య విధానాలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రి సిద్ధంగా ఉందని చెప్పారు.

Updated Date - Mar 13 , 2026 | 04:57 AM