ఫేక్ డాక్యుమెంట్లతో..2.50 కోట్ల కుచ్చుటోపీ!
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:01 AM
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రాంతంలో స్థలాల ధరలు ఆకాశన్నంటుతుండగా మోసాలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ముఠా ఆగడాలు ఇక్కడ ప్లాట్లు కొనాలంటేనే వెన్నులో వణుకు....
ఫోర్జరీ వారసత్వ, డెత్‌సర్టిఫికెట్లతో ప్లాట్ల విక్రయం
బీరంగూడలో వెలుగులోకి భారీ మోసం
నకిలీ పత్రాలతో దర్జాగా రిజిస్ట్రేషన్లు
అసలు వారసుల రంగ ప్రవేశంతో వెలుగులోకి మోసం
అమీన్‌పూర్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రాంతంలో స్థలాల ధరలు ఆకాశన్నంటుతుండగా మోసాలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ముఠా ఆగడాలు ఇక్కడ ప్లాట్లు కొనాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాయి. దర్జాగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని ఓ వ్యక్తికి అంటగట్టి రెండున్నర కోట్ల రూపాయలు లూటీ చేసిన ఉందంతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన మర్లపల్లి శ్రీనివాస్ అమీన్‌పూర్ పట్టణ పరిధి బీరంగూడ సర్వేనెంబర్ 967లోని మల్లిఖార్జున్ నగర్‌లో ప్లాట్ల నెంబర్లు 324, 325 ఒక్కొక్కటి 400 గజాల చొప్పున 800 గజాలను 2024 జూన్‌లో రెండున్నర కోట్లు చెల్లించి కొనుగోలు చేశారు. జీడిమెట్లకు చెందిన కాసులబాద కృష్ణ అనే వ్యక్తి దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద సదరు ప్లాట్లకు జీపీఏ తీసుకుని సేల్‌డీడ్ నెంబర్ 17588బై2004 ద్వారా శ్రీనివా్‌సకు విక్రయించారు. సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. సదరు వ్యక్తి సేల్‌డీడ్‌తో స్థానిక అమీన్‌పూర్ మునిసిపాలిటీకి టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకుని భవన నిర్మాణానికి అనుమతి పొందారు. ఓ ప్లాటులో బోరు వేసి భవన నిర్మాణం చేపట్టగానే అసలు కథ మొదలైంది. అమీన్‌పూర్ పోలీసులు నిర్మాణం వద్దకు చేరుకుని పనులు ఆపాల్సిందిగా సూచించారు. ఫోర్జరీ పత్రాలతో ప్లాట్లను విక్రయించినట్లు తెలపడంతో శ్రీనివాస్ ఖంగు తిన్నాడు.
చనిపోయిన యజమాని పేరుపై నకిలీ పత్రాలతో భారీ మోసం
కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీకి చెందిన ఉన్నం అచ్చమ్మ అనే మహిళ బీరంగూడ మల్లిఖార్జున్ నగర్‌లోని సర్వేనెంబర్ 967లో 800గజాల స్థలాన్ని 2006లో కొనుగోలు చేశారు. ఏప్రిల్ 6, 2012లో ఆమె మృతి చెందారు. అచ్చమ్మ పేరుమీద ఉన్న విలువైన స్థలాలను కాజేసేందుకు జీడిమెట్లకు చెందిన ఉన్నం శ్రీనివాస్ నాయుడు పథకం రచించాడు. మృతురాలి కుమారుడినంటూ శ్రీనివా్‌సనాయుడు ఫోర్జరీ వారసత్వ పత్రాన్ని, అచ్చమ్మ డెత్‌సర్టిఫికెట్‌ను సృష్టించి జీడిమెట్లకు చెందిన దామోదర్‌రెడ్డి అనే వ్యక్తికి 2019లో సేల్‌డీడ్ ద్వారా విక్రయించి లింక్ డాక్యుమెంట్లను సృష్టించారు. సదరు దామోదర్‌రెడ్డి.. కృష్ణ అనే వ్యక్తికి సదరు ప్లాట్లను అమ్మిపెట్టాలని రిజిస్టర్ జీపీఏ చేశాడు. ఈ క్రమంలో బ్రోకర్ల ద్వారా ముందుకెళ్లిన మర్లపల్లి శ్రీనివాస్ 800గజాల స్థలాన్ని రెండున్నరకోట్లు చెల్లించి కొనుగోలు చేశారు. విషయం తెలుసుకున్న ఉన్నం అచ్చమ్మ అసలైన కుమారులు ఉన్నం వెంకటేశ్వర్లు, ఉన్నం పార్థసారధి కోర్టును ఆశ్రయించడంతో సదరు ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ కావడంతో వివాదం రాజుకుంది. ఫోర్జరీకి పాల్పడిన నిందితులపై అమీన్‌పూర్ పోలీసు స్టేషన్‌లో కేసు సైతం నమోదైంది. తనను మోసం చేశారంటూ బాదితుడు శ్రీనివాస్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదై నెలలు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ మోసంలో పోలీసులు జరిపిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. నకిలీ డెత్ సర్టిఫికెట్‌ను ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ నుంచి పొందినట్లు తెలిసింది. జారీ అయిన డెత్ సర్టిఫికెట్ ఫేక్ అంటూ ఇస్నాపూర్ మునిసిపాలిటీ కమిషనర్ రాత పూర్వకంగా స్పష్టం చేశారు. దీంతో పాటు కోర్టు ద్వారా పొందిన వారసత్వ సర్టిఫికెట్ సైతం నకిలీదని తేలింది. కేటుగాళ్లు నకిలీ ఆధార్ కార్డులు సైతం సృష్టించి సబ్‌రిజిస్ట్రార్‌ను బురిడీ కొట్టించారు. సదరు ముఠా బారిన మరికొందరు పడ్డట్లు తెలుస్తోంది. ఇదే పద్ధతిలో ఇదే కాలనీలో 7200 గజాల స్థలాన్ని కూడా కాజేసి కోట్లు దండుకున్నట్లు సమాచారం. కాగా బాదితుడు మర్లపల్లి శ్రీనివాస్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడన్నారు. మరికొందరిని మోసం చేయకుండా నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని, తనకు న్యాయం చేయాలని కోరారు.