Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం

ABN , Publish Date - Feb 04 , 2026 | 02:52 AM

మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించి.. నిస్సిగ్గుగా ముఖం చాటేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై తెలంగాణ నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు...

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం

  • మెగా డీఎస్సీ పేరిట దగా

  • నిరుద్యోగ భృతి అంటూ ద్రోహం

  • రేవంత్‌రెడ్డిపై నిరుద్యోగుల ఆగ్రహం

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, పిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించి.. నిస్సిగ్గుగా ముఖం చాటేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై తెలంగాణ నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన ఆయ న.. అది ఐదేళ్ల హామీ అంటూ పీసీసీ చీఫ్‌తో చిలక పలుకులు పలికించడాన్ని చూసి యువతరం ఛీకొడుతోందని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీనుంచి వచ్చిమరీ చెప్పిపోయిన ప్రియాంక మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదన్నారు. రిక్రూట్‌మెంట్‌ జీరోగా మారిందని, నిరుద్యోగుల ఉసురు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగలడం ఖాయమని మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జాబ్‌ క్యాలెండర్‌కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్‌ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందన్నారు. నమ్మించి నయవంచన చేసినందుకు క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా నిరుద్యోగులు క్షమించే పరిస్థితిలో లేరని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను కూడా రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరిట మోసం చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే 3 దఫాలుగా రైతు బంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని, సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు రూ.2500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేళ్లయినా దిక్కులేకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారని విమర్శించారు. మెగా డీఎస్సీ పేరిట దగా, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ప్రతి నిరుద్యోగి సిద్థంగా ఉన్నారని అన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 02:52 AM