మీరెందుకు చేశారో.. మేమూ అందుకే!
ABN , Publish Date - Feb 02 , 2026 | 02:36 AM
గతంలో రాహుల్, సోనియాలను ఈడీ విచారణకు పిలిస్తే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎందుకు ధర్నాలు చేశారో.. ఇప్పుడు పనికిరాని విచారణ పేరిట మా నాయకుడిని విచారణకు పిలిచినందుకు మేమూ ధర్నా చేశాం....
సోనియా, రాహుల్‌లను ఈడీ పిలిస్తే రేవంత్, కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయలేదా?
మేం ఏ తప్పూ చేయలేదని అర్థమై ఉంటుంది: కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ‘‘గతంలో రాహుల్, సోనియాలను ఈడీ విచారణకు పిలిస్తే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎందుకు ధర్నాలు చేశారో.. ఇప్పుడు పనికిరాని విచారణ పేరిట మా నాయకుడిని విచారణకు పిలిచినందుకు మేమూ ధర్నా చేశాం’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాము, తమ నాయకుడు ఏ తప్పూ చేయలేదని రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి, సిట్ అధికారులకు నేటితో అర్థమై ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆదివారం నందినగర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లీకులు, అబద్ధాలు, అపోహలు సృష్టిస్తూ కాంగ్రెస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. కోఠిలో తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దోపిడీ జరిగితే, గంజాయి స్మగ్లర్లు ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను బండితో తొక్కించి చంపేస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాళేశ్వరం, ఫార్ములా-ఈ, విద్యుత్ కుంభకోణాలంటూ హడావుడి చేశారని, వాటిలో ఏమీ లేదని తేలిందని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ ఏమీ లేదని త్వరలోనే వెల్లడైతుందని ఆయన పేర్కొన్నారు.