Share News

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం: కేటీఆర్

ABN , Publish Date - Jul 28 , 2026 | 07:08 PM

మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి స్వాగతిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ఏమి నేర్చుకుందో ప్రజలకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం: కేటీఆర్
BRS Working President KTR

న్యూఢిల్లీ, జులై 28: మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి స్వాగతిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ఏమి నేర్చుకుందో ప్రజలకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఐదుసార్లు పేపర్ లీక్‌లు జరిగాయని.. అందులో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా మూడుసార్లు జరిగాయని వివరించారు. ప్రస్తుతం దేశానికి జవాబుదారీతనం (Accountability), పారదర్శకత (Transparency), దీర్ఘకాలిక సంస్కరణలు (Long-term Reforms) అవసరమని పేర్కొన్నారు.


డా. కె. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల అమలు ఏమైందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే నందన్ నీలేకని కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించింది.. అయితే దానిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టి రాజకీయ గందరగోళం సృష్టించారని విమర్శించారు. డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకు రాలేదని వివరించారు. అందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఉదాహరణ అని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోక్‌సభ స్థానాలు పెంచాలని చట్టంలో ఉన్నప్పటికీ, 12 ఏళ్లుగా అవి అమలు కాలేదన్నారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్నే అమలు చేయని ప్రభుత్వం.. కొత్త హామీలను ప్రజలు ఎలా నమ్ముతారని సందేహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి జనాభా లెక్కల (Census) తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన జరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


1971 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్‌ను నిలిపివేసి, ఆ తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వం కూడా ఆ గడువును పొడిగించిందని వివరించారు. ఈ కాలంలో దక్షిణ భారత రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయని.. కానీ ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లో జనాభా అధికంగా పెరిగిందని సోదాహరణగా తెలిపారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈసందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు.

Updated Date - Jul 28 , 2026 | 07:30 PM