Share News

ప్రభుత్వానికి పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమే

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:47 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణ చేయడం ఒక రాజకీయ ప్రహసనమని, విచారణ పేరిట ఆయనను 4 గంటల 50 నిమిషాల పాటు కూర్చోపెట్టి పైశాచిక ఆనందం పొందారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

ప్రభుత్వానికి పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమే

  • కేసీఆర్‌ హయాంలోనూ అదే జరిగింది

  • ఎవరి ఫోన్లు విన్నారని అడిగే సంస్కృతి కేసీఆర్‌కు లేదు

  • సిట్‌ విచారణ ఓ ప్రహసనం.. కాంగ్రెస్‌ నేతలకు లీకులు

  • కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని టచ్‌ చేసినట్లే

  • చంద్రబాబుకు, కేంద్రానికి రేవంత్‌ దాసోహం: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణ చేయడం ఒక రాజకీయ ప్రహసనమని, విచారణ పేరిట ఆయనను 4 గంటల 50 నిమిషాల పాటు కూర్చోపెట్టి పైశాచిక ఆనందం పొందారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఏ ప్రభుత్వానికైనా పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమని, కేసీఆర్‌ హయాంలోనూ అదే జరిగిందన్నారు. ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో నాడు కేసీఆర్‌ ప్రభుత్వానికీ అలాగే వచ్చిందన్నారు. ఎవరి ఫోన్‌ విన్నావని అడిగే సంస్కృతి కేసీఆర్‌కు లేదని, చట్టబద్ధంగానే అన్నీ జరిగాయని చెప్పారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు పాత అంశాన్ని మళ్లీ మళ్లీ తెరపైకి తెస్తోందని విమర్శించారు. మీడియా కూడా ప్రభుత్వ అబద్ధాలను యథాతథంగా ప్రచురించడం మానుకోవాలని కోరారు. కేటీఆర్‌ సోమవారం నందినగర్‌ నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. సిట్‌ విచారణలో ఏం జరుగుతుందో అధికారులు బయట ఉన్న కాంగ్రెస్‌ నాయకులకు లీకులు ఇస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన వాట్సాప్‌ గ్రూపుల్లో కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. ఈ కేసు విషయంలో ‘ఇల్లీగల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌’ అంటూ సజ్జనార్‌ ట్వీట్‌ చేయడం హాస్యాస్పదమని, ఆయన జడ్జిలా తీర్పునివ్వడం తగదని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్‌ అని, ఆయనను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టుకున్నట్లేనని పేర్కొన్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను విచారణకు పిలవడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్‌ చేయడమేనన్నారు. ఈ విషయంలో రాసిన ఆయనకు ఏమన్నా అనుమానాలు ఉండొచ్చు కానీ ప్రజలకేం లేవని, వారికి స్పష్టత ఉందన్నారు. ఇవాళ రాజకీయం ఎలా జరుగుతోందంటే పరిపాలనా వైఫల్యాలపై మీడియాలో కూడా చర్చలేదన్నారు.


తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు

కృష్ణా ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి తన పాతబాస్‌ చంద్రబాబుకు, కేంద్రానికి దాసోహం అవుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర నీటి వాటాను తాకట్టు పెడుతున్నారన్నారు. తెలంగాణ జుట్టు కేంద్రం చేతుల్లో ఉందని, అందుకే రేవంత్‌ రెడ్డి నోరు మెదపలేకపోతున్నారని విమర్శించారు. సింగరేణి బొగ్గుగనుల టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌ రెడ్డి భారీ అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన కాల్‌ డాటా తీస్తే అడ్డంగా దొరికిపోతారన్నారు. సింగరేణి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయని, అందుకే వాస్తవాలు బయటికి రావడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో భూముల దోపిడీ జరుగుతోందని, అధికార పార్టీ నాయకులు బౌన్సర్ల సంస్కృతిని ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. దావోస్‌ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వంపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు విచారణలకు భయపడతారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పడం అవాస్తవమని, తమ నాయకత్వం ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తూ ప్రశ్నలను ఎదుర్కొన్నదేనన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 02:48 AM