విధ్వంసమే రేవంత్ విధానం
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:26 AM
ఇళ్లు కూలగొట్టడం.. భూములు ఆక్రమించడం.. రియల్ ఎస్టేట్ దందా చేయడం.. దాని కోసం పేదల జీవితాలు నాశనం చేయడమే రేవంత్‌రెడ్డికి తెలిసిన పాలన...
ఇళ్లు కూలగొట్టి.. భూములు ఆక్రమించి..పేదల జీవితాలను నాశనం చేస్తున్నారు: కేటీఆర్
హైదరాబాద్ సిటీ, నార్సింగ్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ‘ఇళ్లు కూలగొట్టడం.. భూములు ఆక్రమించడం.. రియల్ ఎస్టేట్ దందా చేయడం.. దాని కోసం పేదల జీవితాలు నాశనం చేయడమే రేవంత్‌రెడ్డికి తెలిసిన పాలన’ అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని, రెండేళ్లు ఈ పార్టీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. మూసీ దండి మార్చ్ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు కుటుంబాలతో కలిసి బైరాగిగూడ, హైదర్‌షా కోట్, కేకే నగర్ నుంచి మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వరకు 3.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మధుపార్క్ అపార్ట్‌మెంట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజ్యంపై విమర్శలు చేస్తోన్న రాహుల్‌గాంధీ.. డబ్బు సంచుల కోసం తెలంగాణలో రేవంత్ చేస్తోన్న బుల్డోజర్ అరాచకాలను పట్టించుకోవడం లేదన్నారు. మూసీ బఫర్ జోన్‌పై రకరకాల మాటలు చెబుతున్న కాంగ్రెస్.. గతంలో ఇక్కడి అపార్ట్‌మెంట్లకు ఎలా అనుమతి ఇచ్చిందని, అప్పటి అధికారులు, నాటి కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొట్టాలా..? అని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టులో ఏ ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు.