మాకొద్దు టెలిమెట్రీల గోల.. రాష్ట్రాలదే బాధ్యత
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:01 AM
కృష్ణా నదీ బేసిన్ పరిధిలోని జలాల వినియోగంపై ఏర్పాటు చేసిన టెలిమెట్రీల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ......
చేతులెత్తేస్తూ తెలుగు రాష్ట్రాలకు కృష్ణాబోర్డు లేఖ
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ బేసిన్ పరిధిలోని జలాల వినియోగంపై ఏర్పాటు చేసిన టెలిమెట్రీల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రకటించింది. మరోవైపు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నీటి నష్టాలను గణించడానికి ఆరుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో కమిటీని నియమించింది. తొలి దశలో కృష్ణా నదిపై 18 చోట్ల టెలిమెట్రీలు ఉంటే.. రెండో దశ టెలిమెట్రీలను ఏర్పాటు చేయడానికి సమకూర్చిన నిధులను బోర్డు ఖాతాలో తెలంగాణ జమ చేసింది. కానీ, ఏపీ అంగీకరిస్తే తప్పా.. రెండో దశ టెలిమెట్రీలు ఏర్పాటు చేయబోమని తొలుత మెలిక పెట్టిన కేఆర్‌ఎంబీ.. తాజాగా తొలి దశ టెలిమెట్రీల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. సరిహద్దుల వారీగా టెలిమెట్రీల నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్రాలదేనని పేర్కొంటూ కేఆర్‌ఎంబీ చైర్మన్ ఆమోదంతో ఈ నెల 2న తెలుగు రాష్ట్రాలకు బోర్డు ఎస్‌ఈ గెంటెల వరలక్ష్మి దేవి లేఖ రాశారు. కాగా, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నీటి నష్టాల లెక్క తీయడానికి ఏర్పాటైన కమిటీలో ఎస్ శ్రీనివా్‌సరెడ్డి (సత్తుపల్లి), జె.సత్యనారాయణ (కోదాడ), కె. రామదాసు (నూజివీడు), కె.కిశోర్ (జగ్గయ్యపేట)లతోపాటు కృష్ణా బోర్డు ఈఈలు వైఎం గోపాలకృష్ణ, ఎస్. వెంకటేశ్ ఉన్నారు. 90 రోజుల్లోగా లెక్కలు తీసి నివేదిక సమర్పించాలని, అందుకోసం తెలుగు రాష్ట్రాల అధికారులను వివరాలు అడిగి తీసుకోవాలని సూచించింది.