కోటి లింగాల ప్రదేశానికి జాతీయ ప్రాధాన్య గుర్తింపు లేదు
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:42 AM
కోటిలింగాల స్థలానికి జాతీయ ప్రాధాన్యం కలిగిన గుర్తింపులేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందువల్ల ఆ ప్రదేశానికి భారత పురావస్తు శాఖ...
లోక్‌సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): కోటిలింగాల స్థలానికి జాతీయ ప్రాధాన్యం కలిగిన గుర్తింపులేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందువల్ల ఆ ప్రదేశానికి భారత పురావస్తు శాఖ (ఎస్సఐ)కు ఎలాంటి సంబంధంలేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మౌఖిక సమాధానం ఇచ్చారు. కోటిలింగాల తెలంగాణ వారసత్వ శాఖ పరిరక్షణలో ఉందన్నారు. కోటిలింగాల పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, నిర్వహణ తెలంగాణ వారసత్వ శాఖ చూస్తుందని సమాధానం ఇచ్చారు. 1979-1983 మధ్య కోటిలింగాలలో జరిగిన తవ్వకాల్లో చైత్య గృహాలు, విహార సముదాయం, ఇటుక నిర్మాణాలు, పురాతన వస్తువులు వంటివి బయటపడ్డాయన్నారు. అలాగే నాణేలు, కుండలు, ఇనుప వస్తువులు, టెర్రకోటతో చేసిన పూసలు, షెల్ బ్యాంగిల్స్, శాసనాలు తదితరాలు ఉన్నాయన్నారు. కోటిలింగాలలో పురావస్తు అవశేషాల తవ్వకం, సంరక్షణ, పరిరక్షణ కోసం తెలంగాణ వారసత్వ శాఖ గత ఐదేళ్లుగా ఒక్క రూపాయి కేటాయించలేదని తెలిపారు. శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయం దగ్గర కొన్ని మౌలిక సదుపాయాల పనులు మాత్రమే జరిగాయన్నారు.