Share News

పొత్తుకు కొత్తగూడెమే కీలకం!

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:27 AM

రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావటంతో పొత్తులపై రాజకీయ పార్టీలు చర్చలు వేగవంతం చేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య పొత్తు చర్చల్లో కొత్తగూడెం కార్పొరేషన్‌ కీలకంగా మారింది.

పొత్తుకు కొత్తగూడెమే కీలకం!

  • మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ షరతు

  • కొత్తగూడెంలో 30 డివిజన్లు కోరుతున్న పార్టీ

  • 17 మాత్రమే ఇస్తామంటున్న కాంగ్రెస్‌

  • పొత్తు లేకపోతే రాష్ట్రమంతా ఒంటరిగానే..

  • అవసరమైతే ఇతర పార్టీలతో..: కూనంనేని

  • సీపీఎం, బీఆర్‌ఎస్‌ పరస్పర సహకారం?

హైదరాబాద్‌, జనవరి 28(ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావటంతో పొత్తులపై రాజకీయ పార్టీలు చర్చలు వేగవంతం చేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య పొత్తు చర్చల్లో కొత్తగూడెం కార్పొరేషన్‌ కీలకంగా మారింది. ఇక్కడ 60 డివిజన్లు ఉండగా, తమకు 30 డివిజన్లు ఇవ్వాలని సీపీఐ కోరుతోంది. కాంగ్రెస్‌ మాత్రం 17 డివిజన్లే ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. దీంతో పొత్తు చర్చల్లో ప్రతిష్టంభ న ఏర్పడినట్లు సమాచారం. ఒకవేళ కొత్తగూడెంలో కాంగ్రెస్‌ పార్టీ పొత్తుకు సహకరించకపోతే రాష్ట్రమంతా ఒంటరిగానే బరిలోకి దిగుతామని.. తమకు బలమున్న చోట అభ్యర్థులను నిలబెడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అంటున్నారు. అవసరమైతే టీడీపీసహా కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో తమకు బలం ఉందని సీపీఐ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మునిసిపల్‌ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్‌ కలిసి వెళ్తుందా లేదా?అన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న సీపీఎం.. సర్పంచ్‌ ఎన్నికల్లో కొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిందనే వార్తలు వచ్చాయి. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయనే చర్చ జరుగుతోంది. వైరా మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసేందుకు సీపీఎం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మిర్యాలగూడ మునిసిపాలిటీలో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అశ్వారావు పేటలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - Jan 29 , 2026 | 05:27 AM