ఎవరొచ్చినాపరకాల మనదే..!
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:24 AM
ఎవరొచ్చినా పరకాల మనదే. ఇక్కడ నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది’’ అని మాజీ ఎ మ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు....
ఇక్కడ్నుంచి సురేఖ పోటీ చేస్తుంది.. సుస్మితా పటేల్‌ను ఆదరించండి: కొండా మురళి
గీసుగొండ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎవరొచ్చినా పరకాల మనదే. ఇక్కడ నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది’’ అని మాజీ ఎ మ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ప్రభ బండిని కుమార్తె సుస్మితా పటేల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా తమ వెంట ఉండి రాజకీయ ఎదుగుదలకు అండగా నిలిచిన గీసుగొండ మండల ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ఇక నుంచి సుస్మిత మనకు విశిష్ట అతిథి అని ప్రకటించారు. వారానికోసారి వంచనగిరిలో ప్రజల బాగోగులు చూసుకుంటారని, ఇక మీకు బాధలు ఉండవని ప్రజలకు భరోసా ఇచ్చారు. ‘కొండా మురళి మాట్లాడితే ఎదుటోని గుండెలు అదురుతాయి. సుస్మిత నా కంటే ధైర్యవంతురాలు. వీడు, వాడు అని చూడదు. ఎవరినైనా వదిలిపెట్టదు. భయపడే తత్వం ఆమెకు లేదు. కార్యకర్తల కోసం ఏమైనా చేస్తుంది’ అని చెప్పారు. తాను చావు నుంచి బయటపడ్డానంటే కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దయ, మండల ప్రజల ఆశీస్సులేనని అన్నారు. జీవితంలో ఎన్నో నేర్చుకున్న తనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం రాలేదని, ఎమ్మెల్సీ వస్తుంది.. పోతుందని, ఇప్పుడు మళ్లీ అవకాశం వస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కొండా సురేఖను, కుమార్తె సుస్మితను ఎమ్మెల్యేగా చేసే బాధ్యతను తీసుకున్నానని చెప్పారు.
నాన్న పక్కన ఉన్నందున శాంతంగా మాట్లాడుతున్నా..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కొమ్మాల వేదికగా కాంగ్రె్‌స జెండాను ప్రారంభించిన మా తల్లిదండ్రులు కొండా మురళి-సురేఖలు రాజకీయంలో తిరుగులేకుండా ఎదిగారని కొండా సుస్మిత అన్నారు. అదే చోటు నుంచి తాను రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి పక్కన ఉన్నాడు కాబట్టి శాంతంగా మాట్లాడుతున్నానని.. లేకుంటే వేరేవిధంగా ఉండేదని చెప్పారు. ఎంతటి శత్రువులకైనా కొండా మురళి అంటే భయం ఉంటుందన్నారు. పరకాలలో పోటీకి తాను సిద్ధమని ఆమె తెలిపారు.