సైట్ విజిట్ నిబంధన దుర్వినియోగం
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:49 AM
గనుల కేటాయింపులో టెండర్లు వేసే ముందు సైట్ విజిట్ చేయాలనేది దేశ వ్యాప్తంగా ఉన్న నిబంధనే అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
నైనీ విషయంలో మంత్రుల గొడవలు
మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కనుమరుగే
మెజారిటీ స్థానాల్లో మాదే గెలుపు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్/యాదాద్రి, ఫిబ్రవరి 3(ఆంధ్ర జ్యోతి): గనుల కేటాయింపులో టెండర్లు వేసే ముందు సైట్ విజిట్ చేయాలనేది దేశ వ్యాప్తంగా ఉన్న నిబంధనే అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇది ప్రజలకు మేలు చేస్తుందని.. అయితే దీన్ని తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. 17 కంపెనీలు నైనీ బొగ్గు బ్లాకును విజిట్ చేస్తే ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టుకుంటున్నారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో సుస్థిరమైన అభివృద్ధి కావాలనే ఆకాంక్షకు రెక్కలు తొడిగే బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశ పెట్టిందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే కనుమరుగు కానుందని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మెజారిటీ మునిసిపాలిటీలను బీజేపీ దక్కించుకోవడం ఖాయమన్నారు. మంగళవారం భువనగిరిలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మునిసిపాలిటీలకు ఒరిగిందేమీ లేదని, కేసీఆర్ కుటుంబం ప్రజలను దోచుకోవడానికే పరిమితమైందని విమర్శించారు. దోచుకున్న సొమ్ము పంపకాల కోసం బీఆర్‌ఎ్‌సలో పంచాయితీ నడుస్తోందన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రె్‌స-బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో మంత్రులు పంపకాల కోసం రోడ్డెక్కారని, ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు.
ఈ ఏడాది చివరికి ఎయిమ్స్ పూర్తి..
బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణ పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన భువనగిరి జిల్లాలోని ఎయిమ్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతి, అందుబాటులో ఉన్న వైద్యసేవలపై ఎయిమ్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.1,110 కోట్లతో చేపట్టిన ఎయిమ్స్ నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు రూ.832 కోట్లతో 85 శాతం పూర్తి చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు.