ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం పెట్టండి
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:37 AM
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.
ఖజానా ఖాళీ కుండ అంటూనే గాంధీ ఫ్యామిలీకి వెయ్యి కోట్లు ఇస్తామని ఎలా చెబుతారు?
ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తీరుతోనే అప్పుల కుప్పగా తెలంగాణ
రాష్ట్రానికి మోదీ 12 లక్షల కోట్లు కేటాయించారు
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
న్యూఢిల్లీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చి అధికారంలోకొచ్చిందని.. హామీలు అమలు చేయాలని అడిగితేనేమో ఖజానాలో లంకె బిందెలకు బదులుగా ఖాళీ మట్టి కుండులు ఉన్నాయంటూ ప్రజలను అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖజానా ఖాళీగా ఉందంటున్న రేవంతే.. ఇటీవల ఓ సభలో సోనియా, రాహుల్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ. వెయ్యికోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారని పేర్కొన్నారు. రేవంత్ మాటలను బట్టి ‘రాష్ట్ర ఖజానా నిల్ - కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్’ అన్నట్టుగా అనిపిస్తోందని దుయ్యబట్టారు. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఆర్థిక స్థితిని పదేళ్ల పాలన ద్వారా బీఆర్‌ఎస్ దెబ్బతీసిందని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గత 27 నెలల్లోనే అత్యంత దయనీయ స్థితికి చేర్చిందని విమర్శించారు. ఆర్థికంగా తెలంగాణ దుస్థితికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణం అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల కోసం కూడా కేంద్రం అందిస్తున్న వడ్డీలేని రుణాలపై రేవంత్ ప్రభుత్వం ఆధారపడుతుండటం చూస్తుంటే ఆర్థికంగా తెలంగాణ ఎంత దుస్థితిలో ఉందో అర్థమవుతోందని చెప్పారు. చివరికి వడ్డీల చెల్లింపులకు, ఉద్యోగుల జీతాలకు, రైతు భరోసా నిధులకు, సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర సర్కారు మళ్లీ మళ్లీ అప్పులు చేస్తోందన్నారు. రుణం తీసుకోకుండా ఒక్క పనికూడా చేయలేని దుస్థితికి తెలంగాణ చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంద మార్చి 16న ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని లేఖలో కిషన్‌రెడ్డి కోరారు. 2014 నుంచి తెలంగాణకు ప్రధాని మోదీ ఎంతో చేశారని, 12 ఏళ్లలో దాదాపు రూ.12లక్షల కోట్లు కేటాయించారని చెప్పారు. ఎస్‌ఏఎస్సీఐ (సాస్కి) పథకం కింది రాష్ట్రానికి గత ఐదేళ్లలో రూ.10వేలకోట్లకు పైగా వడ్డీలేని రుణాలు అందించినట్లు చెప్పారు. ఈ నిధులతో రోడ్ల విస్తరణ నుంచి యంగ్ ఇండియా పాఠశాలల వరకూ మేలు జరిగిందన్నారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య రేడియల్ రోడ్లు, గోదావరి-మూసీ అనుసంధానం, మూసీ నది సుందరీకరణ తదితర ప్రాజెక్టులకు సాస్కి నిధులు ఖర్చు చేశారని వివరించారు.
పెట్రో ఉత్పత్తుల లభ్యతపై ఆందోళన అక్కర్లేదు
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్రో ఉత్పత్తుల లభ్యతపై ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ‘మనదేశ అవసరాలకు అనుగుణంగా పెట్రోఉత్పత్తుల లభ్యత ఉంది. అవసరమైన మేర దిగుమతి చేసుకోవడానికి కూడా ఇబ్బందుల్లేవు. మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా దేశంలో పెట్రో ఉత్పత్తులకు కొరత తలెత్తే ప్రసక్తేలేదు’ అని ఒక ప్రకటనలో ఆయన స్పష్టంచేశారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్థం, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో భార త్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎగుమతులు, దిగుమతులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్రం.. వివిధ మంత్రిత్వశాఖల బృందాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.