ఉమ్మడి ఖమ్మంలో విచిత్ర పొత్తులు
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:46 AM
మునిసిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీల మధ్య చిత్ర విచిత్రమైన పొత్తులు కుదిరాయి. ఈ జిల్లాలో సీపీఎం ఏకకాలంలో ఇటు అధికార కాంగ్రె్‌సతో, అటు ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సతోనూ దోస్తీ కట్టింది.
మునిసిపల్ ఎన్నికల వేళ మారిన మిత్రబంధాలు.. సీపీఎం దోస్తీ ఓవైపు బీఆర్‌ఎ్‌సతో.. మరోవైపు కాంగ్రె్‌సతో
కాంగ్రె్‌సతో సీపీఐకి చెడిన స్నేహం
వైరాలో బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి పోటీకి సన్నాహాలు
ఖమ్మం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునిసిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీల మధ్య చిత్ర విచిత్రమైన పొత్తులు కుదిరాయి. ఈ జిల్లాలో సీపీఎం ఏకకాలంలో ఇటు అధికార కాంగ్రె్‌సతో, అటు ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సతోనూ దోస్తీ కట్టింది. ఖమ్మం జిల్లా పరిధిలోని మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎ్‌సతో జతకట్టిన సీపీఎం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రె్‌సతో కలిసి బరిలోకి దిగుతోంది. మరోవైపు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో కలిసి పోటీ చేయడంతోపాటు ఇప్పటిదాకా మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న సీపీఐ మాత్రం ఈసారి హస్తం పార్టీని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగుస్తున్నా.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలు ఫలించలేదు. దీంతో ఈ పార్టీల మధ్య మిత్ర బంధం దాదాపు చెడినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. అక్కడక్కడ బీఆర్‌ఎ్‌సతో దోస్తీ కట్టేందుకు సైతం సీపీఐ సై అంటుండడం ఆసక్తి రేపుతోంది. ఖమ్మం జిల్లా పరిధిలో ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మునిసిపాలిటీలు ఉండగా.. ఏదులాపురంలో కాంగ్రె్‌సతో సీపీఐకి పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఒంటరిగానే 15చోట్ల నామినేషన్లు వేసింది. ఇక్కడ బీఆర్‌ఎస్, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. సీపీఐని కూడా పొత్తులో కలుపుకొనేందుకు బీఆర్‌ఎస్ తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది.
మధిర మునిసిపాలిటీలో సీపీఐ ఐదు డివిజన్లలో నామినేషన్లు వేయగా.. పొత్తుకోసం సీపీఐని కాంగ్రెస్ ఆహ్వానించింది. ఒక వార్డు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. అయితే కనీసం రెండువార్డులైనా ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది. ఇక్కడ పొత్తు కుదిరే అవకాశాలపై మంగళవారం స్పష్టత రానుంది. ఈ మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి.
వైరాలో వామపక్షాలతో కూటమిగా బీఆర్‌ఎస్..
వైరాలో ఈ రెండు పార్టీలకు తోడుగా సీపీఐ కూడా పొత్తులో చేరింది. దీంతో ఇక్కడ బీఆర్‌ఎస్, వామపక్షాలు కూటమిగా కాంగ్రె్‌సను ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. సత్తుపల్లి, కల్లూరు మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎస్, సీపీఎం కలిసి పోటీ చేస్తుండగా.. సీపీఐ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఖమ్మం జిల్లాలోని మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎ్‌సతో కలిసి కాంగ్రె్‌సపై కాలుదువ్వుతున్న సీపీఎం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం అధికార పార్టీతో స్నేహం చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐకి మిత్రబంధం చెడడంతో ఈ అవకాశాన్ని సీపీఎం అందిపుచ్చుకుంది. కొత్తగూడెం, అశ్వారావుపేట మునిసిపాలిటీల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇల్లెందులో మాత్రం సీపీఎం.. బీఆర్‌ఎ్‌సతోనే కలిసి పోటీలో ఉంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుండగా, సీపీఐ.. టీడీపీతో కలిసి బరిలోకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పొత్తులు, సీట్ల లెక్క తేలనుంది.