Share News

ఖమ్మంలో కవిత నిరాహార దీక్ష

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:47 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఖమ్మంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్‌ భూముల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం రాత్రి ఆమె అనూహ్యంగా దీక్షకు దిగారు.

ఖమ్మంలో కవిత నిరాహార దీక్ష

  • ‘భూదాన్‌’ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌

  • విశారదన్‌ మహారాజ్‌తో కలిసి అంబేద్కర్‌ భవన్‌లో దీక్ష

  • తొలుత బాధితులకు పరామర్శ.. జడ్పీ సెంటర్‌లో ధర్నా

  • అదుపులోకి తీసుకొని రాత్రి వదిలేసిన పోలీసులు

  • అనంతరం దీక్షకు కూర్చున్న నేతలు

ఖమ్మం క్రైం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఖమ్మంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్‌ భూముల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం రాత్రి ఆమె అనూహ్యంగా దీక్షకు దిగారు. వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఖమ్మం నగరంలోని అంబేడ్కర్‌ భవనంలో పునరావాసం కల్పించగా.. కవిత సోమవారం ఉదయం బీసీ ఎస్సీ, ఎస్టీ జేఎసీ చైర్మన్‌ విశారదన్‌ మహారాజ్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. వారిని పరామర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూదాన్‌ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నవారిని అక్రమంగా బయటకు పంపి.. ఇళ్లను కూల్చారని, కూల్చిన చోటే ప్రభుత్వం వారికి స్థలంతోపాటు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం జాగృతి నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నగరంలోని జడ్పీ సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. సుమారు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగడంతో.. విరమింపజేసేందుకు ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్‌.. కవిత, విశారదన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. జిల్లా కలెక్టర్‌ వస్తేనే తాము మాట్లాడతామని, అప్పటివరకు ధర్నా విరమించబోమని చెప్పడంతో ఆర్డీవో వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు కవిత, విశారదన్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఖమ్మం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాత్రి 8గంటల సమయంలో వారిని వదిలేశారు. దీంతో కవిత హైదరాబాద్‌ వెళతారని అందరూ భావించగా.. ఆమె మళ్లీ ఖమ్మం అంబేద్కర్‌ భవన్‌కు చేరుకుని నిరాహార దీక్షకు దిగారు. భూదాన్‌ భూములు 60 ఎకరాలకు పైగా ఉండాలని, ప్రస్తుతం 30 ఎకరాలే ఉన్నట్లు చూపించడం అన్యాయమని ఈ సందర్భంగా వారు అన్నారు. తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.


కవిత సహా 45 మందిపై కేసు..

అనుమతి లేకుండా ఖమ్మం జడ్పీసెంటర్‌లో ధర్నా నిర్వహించినందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ విశారదన్‌ మహారాజ్‌ సహా 45 మందిపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్నా వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని, ఓ కానిస్టేబుల్‌ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఈ కేసులోని 45 మందిలో ఖమ్మం జిల్లాతో సంబంధం లేని 33 మంది నిజామాబాద్‌, వనపర్తి, నల్లగొండ, కామారెడ్డి, హన్మకొండ, హైదరాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చి అంబేడ్కర్‌ భవన్‌ ఆవరణలో ఉన్న బాధితులను తప్పుదోవ పట్టించి, రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 03:47 AM