మూసీలో అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే: కవిత
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:15 AM
మూసీనది మధ్యలో పెద్దలు కడుతున్న భవనాలను వదిలేసి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా
నార్సింగ్, హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మూసీనది మధ్యలో పెద్దలు కడుతున్న భవనాలను వదిలేసి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిపేట మండలం నార్సింగ్‌లో నిర్మాణంలోని ఓ భవనం వద్ద కవిత మంగళవారం ధర్నా చేపట్టారు. మూసీకి ఆనుకుని ఉన్న ఈ భవనాన్ని కూల్చాల్సిందేనని, హైడ్రా కమిషనర్ వెంటనే బుల్డోజర్ తేవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు కదిలేది లేదన్నారు. నార్సింగ్ వద్ద ప్రైవేట్ వ్యక్తులు నిర్మిస్తున్న ఇళ్లు సక్రమమైతే మధు పార్క్ వారికి ఇందులో ఫ్లాట్స్ ఇవ్వాలన్నారు. మూసీలో నిర్మిస్తున్న ఈ భవనానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతిచ్చిందని, కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తోందని.. ఇది ఎలా సక్రమమైందో హైడ్రా కమిషనర్ చెప్పాలన్నారు. నార్సింగ్ పోలీసులు కవితను అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. రెండు రోజుల్లోగా అక్రమ భవనాన్ని కూల్చకుంటే న్యాయపోరాటం చేస్తామని కవిత అన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకే...: హైడ్రా
కవిత ఆరోపణలపై హైడ్రా స్పందించింది. బీఆర్‌ఎస్ హయాంలోనే ఆదిత్య బిల్డర్డ్స్‌కు అనుమతులు వచ్చాయని ఒక ప్రకటనలో గుర్తుచేసింది. ఆ తర్వాత మూసీలోకి జరిగి సంస్థ రిటైనింగ్ వాల్ నిర్మించడంతో తొలుత అనుమతులు రద్దయ్యాయని తెలిపింది. దీంతో ఆదిత్య బిల్డర్స్ హైకోర్టును ఆశ్రయించగా.. పరిశీలించాలని అధికారులను కోర్టు ఆదేశించిందన్నారు. అనంతరం రిటైనింగ్ వాల్‌ను తొలగించిన సంస్థ.. వెనక్కి జరిగి నిర్మిస్తామని హామీతో అధికారులు నివేదిక ఇవ్వగా.. అనుమతులను హైకోర్టు పునరుద్ధరించిందని వెల్లడించింది. ఈ మేరకే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తుచేసింది.