నిక్కచ్చిగా ఘోష్ కమిషన్ నివేదిక
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:56 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)లు ఇచ్చిన నివేదికలే అత్యంత కీలకమని అడ్వకేట్ జనరల్...
కాళేశ్వరం కేసులో ఏజీ వాదనలు
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)లు ఇచ్చిన నివేదికలే అత్యంత కీలకమని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ కీలక ఏజెన్సీలు ఇచ్చిన పత్రాల ఆధారంగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిక్కచ్చిగా నివేదిక ఇచ్చిందని, బాధ్యులను గుర్తించిందని తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితాసబర్వాల్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. జస్టిస్ ఘోష్ కమిషన్ మెరిట్స్ ఆధారంగా నివేదిక ఇచ్చిందని, ఎవరికో వ్యతిరేకంగా ఇచ్చినది కాదని పేర్కొన్నారు. అక్రమాలు జరిగాయనడానికి నిదర్శనంగా పిల్లర్లు కుంగిన ఘటన ప్రత్యక్షంగా కనిపిస్తోందని తెలిపారు. ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద వేసిన సాధారణ కమిషన్ అని, న్యాయ విచారణ కమిషన్ కాదన్నారు. ఈ పిటిషన్లపై సీనియర్ న్యాయవాదులు గంటలకొద్దీ సమయాన్ని తీసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉత్తరప్రత్యుత్తరాల నిమిత్తం గురువారం సమయం కేటాయిస్తున్నామని..ఆ రోజున పిటిషనర్లు, ప్రభుత్వం వాదనలను ముగించాలని చెప్పింది.