Share News

బీటెక్‌ సెకండియర్‌ తర్వాత ఎగ్జిట్‌ ఆప్షన్‌

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:02 AM

బీటెక్‌ సెకండియర్‌ తర్వాత ఏ కారణంతోనైనా చదువు మానేయాలనుకున్న విద్యార్థులకు ఎగ్జిట్‌ ఆప్షన్‌ను జేఎన్‌టీయూ కల్పించింది.

బీటెక్‌ సెకండియర్‌ తర్వాత ఎగ్జిట్‌ ఆప్షన్‌

  • బయటకు వెళ్లాలనుకునే విద్యార్థులకు డిప్లొమా సర్టిఫికెట్‌

  • ప్రైవేటు అటానమస్‌ కాలేజీలకు జేఎన్‌టీయూ ఆదేశాలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): బీటెక్‌ సెకండియర్‌ తర్వాత ఏ కారణంతోనైనా చదువు మానేయాలనుకున్న విద్యార్థులకు ఎగ్జిట్‌ ఆప్షన్‌ను జేఎన్‌టీయూ కల్పించింది. రెండేళ్లలో 4 సెమిస్టర్లకు సంబంధించిన అన్ని సబ్జెక్టులు పూర్తిచేసిన వారికి డిప్లొమా సర్టిఫికెట్‌ జారీ చేయనుంది. ఆర్‌25 రెగ్యులేషన్‌ ప్రకారం ఎగ్జిట్‌ విధానం ప్రస్తుత (2025-26) విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని ప్రైవేటు అటానమస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎగ్జిట్‌ కోరుకునే విద్యార్థులు తమ ప్రణాళికను సెకండియర్‌ రెండో సెమిస్టర్‌ ప్రారంభంలోనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌కు నివేదించాల్సి ఉంటుంది. ఆయా ప్రిన్సిపాళ్ల నుంచి అందిన సమాచారం మేరకు జేఎన్‌టీయూ డిప్లొమా సర్టిఫికెట్‌ అందజేస్తుంది. ఆర్‌25 నిబంధనల ప్రకారం బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులకు 7.5 కంటే ఎక్కువ సీజీపీఏ ఉంటే డిగ్రీ సర్టిఫికెట్‌లో ఫస్ట్‌క్లాస్‌ విత్‌ డిస్టింక్షన్‌ అని పేర్కొంటారు. ఏదైనా సెమిస్టర్‌లో బ్యాక్‌ లాగ్‌ సబ్జెక్టులను సప్లిమెంటరీలో పూర్తిచేసి 6.5-7.5 లేదా అంతకంటే ఎక్కువ సీజీపీఏ తెచ్చుకున్న విద్యార్థులకు ఫస్ట్‌ క్లాస్‌ మాత్రమే ఇస్తారు. 5.5-6.5 సీజీపీఏ ఉన్న వారికి సెకండ్‌ క్లాస్‌, 5-5.5 కన్నా తక్కువ ఉన్నవారికి పాస్‌ క్లాస్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు.

Updated Date - Mar 04 , 2026 | 03:02 AM