Share News

ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు కూలీల మృతి

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:46 AM

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు కూలీల మృతి

  • మృతుల్లో ఓ బాలిక, ముగ్గురు మహిళలు

  • మరో ఎనిమిది మందికి గాయాలు

మల్లాపూర్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకరు 13 ఏళ్ల బాలిక కాగా మిగిలిన ముగ్గురు మహిళలు. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని మొగిలిపేటకు చెందిన ఎర్రంశెట్టి గంగాధర్‌ అనే రైతు తమ గ్రామానికి చెందిన 10 మంది మహిళలు, ఇద్దరు విద్యార్ధినిలను తోటలో పసుపు తీయడానికి మంగళవారం ఉదయం తన ట్రాక్టర్‌లో తీసుకెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం వారంతా అదే ట్రాక్టర్‌లో ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు. అయితే, మొగిలిపేట శివారులో ప్రమాదవశాత్తు అదుపు తప్పిన ఆ ట్రాక్టర్‌ పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ క్రమంలో ట్రాక్టర్‌ ట్రాలీలో ఉన్నవారంతా దాని కిందే ఇరుక్కుపోగా స్థానికులు వారిని బయటకు తీశారు. కానీ, మంగళరాపు లలిత(45), సంపంగి సాయమ్మ(38), పెద్దిరెడ్డి గంగు(45)తోపాటు రొడ్డ వైష్ణవి(13) అనే ఆరో తరగతి విద్యార్థిని ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక, గాయపడిన వారిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Feb 04 , 2026 | 03:46 AM