విమాన విడిభాగాల తయారీ హబ్‌గా భారత్!
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:23 AM
విమాన విడిభాగాల తయారీ రంగంలో భారతదేశం ప్రపంచానికే హబ్‌గా మారేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వింగ్స్ ఇండియా-2026 ప్రదర్శనకు హాజరైన ఆ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వింగ్స్ ఇండియా-2026కి హాజరైన సంస్థల ప్రతినిధుల వ్యాఖ్య
అదరగొట్టిన వింగ్స్ ఇండియా ప్రదర్శన
హైదరాబాద్ సిటీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): విమాన విడిభాగాల తయారీ రంగంలో భారతదేశం ప్రపంచానికే హబ్‌గా మారేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వింగ్స్ ఇండియా-2026 ప్రదర్శనకు హాజరైన ఆ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమాన విడిభాగాల రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను ఈ ప్రదర్శన చూపెట్టిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా-2026 ప్రదర్శనలో పదుల సంఖ్య లో కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి. భారతదేశంలో తయారయ్యే విమాన భాగాలకు యూరప్, అమెరికా తదితర దేశాల్లో మంచి డిమాండ్ ఉందని ప్రదర్శనలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. విమాన తయారీ, విడి భాగాల ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. కాగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయ కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులకు ఈ ప్రదర్శన ద్వారా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు.
విమాన విన్యాసాలు.. ఉషా ఉతుప్ సంగీత ఝరి
వింగ్స్ ఇండియా ప్రదర్శనకు శుక్రవారం హాజరైన సందర్శకులు విమాన విన్యాసాలను చూసి వారెవ్వా అనుకోవడమే కాక సంప్రదాయ, సంగీత హోరులో ఉత్సాహంగా గడిపారు. ఎయిర్ ఇండియా సంస్థ ‘ఎక్స్ ప్లోర్ మోర్... ఎక్స్‌ప్రెస్ మోర్’ పేరుతో నిర్వహించిన సంగీత కచేరి సంద ర్శకుల్లో జోష్‌ను తెచ్చింది. ప్రముఖ గాయని ఉషా ఉతుప్ పాడిన పాటలకు సందర్శకులు కేరింతలు కొట్టారు. మధ్యలో వెస్ట్రన్ మ్యూజిక్ బ్యాండ్ ఇచ్చిన ప్రదర్శనతో మైమరిచిపోయారు.