వేసవి తాపానికి.. స్మార్ట్ కూలింగ్‌తో పరిష్కారం..
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:03 AM
చలికాలం ప్రభావంతో చాలా మంది తమ ఇళ్లలోని ఏసీలను కొంతకాలంగా ఉపయోగించడమే లేదు. కానీ ఎండల తీవ్రత మొదలైందంటే మాత్రం ఆ ఏసీలు నిత్యం ఆన్‌లో ఉండాల్సిందే.
ఇటాలియన్ ‘రేడియంట్ కూలింగ్‘ టెక్నాలజీతో వేసవి తాపానికి స్మార్ట్ కూలింగ్ పరిష్కారం
ఐఐటీ హైదరాబాద్‌లో ఇప్పటికే వినియోగం, సత్ఫలితాలు
ఏసీలు, కూలర్లు లేకుండానే హాస్టల్ గదుల్లో చల్లదనం
30 శాతం మేర విద్యుత్ ఆదా, పర్యావరణ హితం కూడా
కంది, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : చలికాలం ప్రభావంతో చాలా మంది తమ ఇళ్లలోని ఏసీలను కొంతకాలంగా ఉపయోగించడమే లేదు. కానీ ఎండల తీవ్రత మొదలైందంటే మాత్రం ఆ ఏసీలు నిత్యం ఆన్‌లో ఉండాల్సిందే. వేసవి తాపం నుంచి ఉపశమనానికి ఏసీలు ఇటీవల తప్పనిసరిగా మారినా.. ఏసీల వినియోగంతో విద్యుత్ బిల్లు భారం కూడా పెరుగుతుంది. అలాగని విద్యుత్ బిల్లుకు భయపడి ఏసీని ఉపయోగించకుండా ఉండలేని పరిస్థితి. మరి, ఈ ఏసీలు, ఎయిర్ కూలర్లు లేకుండా మన గది సహజసిద్ధంగా చల్లబడితే ఎలా ఉంటుంది ? ఏసీ లేకుండా గదిలో చల్లదనమా ? ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నారా.. ఇటలీకి చెందిన రేడియంట్ కూలింగ్ టెక్నాలజీతో అది సాధ్యమే. ఈ సాంకేతికతను ఉపయోగిస్తే మండు వేసవిలోనూ ఏసీలకు గుడ్‌బై చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఏసీలకు బదులుగా ఈ రేడియంట్ కూలింగ్ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. ఈ విధానంతో సత్ఫలితాలు వస్తున్నాయని విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది కూడా చెబుతున్నారు.
ఏమిటి ఈ రేడియంట్ కూలింగ్ టెక్నాలజీ
సాధారణంగా ఏసీలు, కూలర్లు గాలిని చల్లబరుస్తాయి. అదే ఈ రేడియంట్ కూలింగ్ టెక్నాలజీ గాలికి బదులుగా భవనంలోని గోడలు, శ్లాబులను చల్లబరిచి సహజసిద్ధమైన చల్లదనాన్ని అందిస్తుంది. ఈ విధానంలో ఏదైనా భవనంలోని పైకప్పు లేదా భూమిలో అమర్చిన పైపుల్లో చల్లని నీటిని ప్రసరింపజేసి ఉష్ణోగ్రతలను నియంత్రిస్తారు. చిల్లింగ్ మిషన్ ద్వారా సరఫరా అయ్యే చల్లని నీరు గదుల్లో అమర్చిన గొట్టాల ద్వారా ప్రవాహించి తిరిగి అదే మిషన్‌కు చేరుకుంటుంది. పూర్తిగా క్లోజ్డ్ సిస్టమ్‌లో పనిచేసే ఈ విధానంలో గదుల్లోని తలుపులు, కిటికీలు తెరిచి ఉన్నా కూలింగ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ కారణం వల్లే ఈ సాంకేతికతను ఓపెన్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. సంప్రదాయ ఏసీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న ఈ రేడియంట్ కూలింగ్ టెక్నాలజీపై ప్రపంచమంతా ఇప్పుడు దృష్టి సారిస్తోంది. వీటి నిర్వహణ ఖర్చు తక్కువ కావడం, విద్యుత్ పొదుపుతో పాటు ధూళి ప్రసరణ, శబ్ధం తక్కువగా ఉండడం ఇందుకు ప్రధాన కారణాలు. ఏసీలతో పోలిస్తే రేడియంట్ కూలింగ్‌లో 30 శాతం వరకు విద్యుత్ పొదుపు సాధ్యమని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ప్రారంభ దశలో విద్యుత్ వినియోగం కొద్దిగా ఎక్కువగా ఉన్నా.. ఒక్కసారి భవనం చల్లబడిన తర్వాత రోజువారీ విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాక, ఈ సాంకేతికత పర్యావరణ హితం కూడా కావడం విశేషం. రేడియంట్ కూలింగ్ సిస్టమ్‌లో ఉపయోగించే ఆర్-134 రిఫ్రిజిరెంట్ కర్భన ఉద్గారాలను దాదాపుగా విడుదల చేయదు. సాధారణ ఏసీల్లో వాడే ఆర్-22 వంటి గ్యాస్‌లతో పోలిస్తే ఇది పర్యావరణానికి ఎంతో సురక్షితం. పైగా, ఈ టెక్నాలజీ ద్వారా గదిలోని గాలి నాణ్యత అధికంగా ఉంటుంది. దుమ్ము, అలెర్జీ కారకాల ప్రసరణ తగ్గుతుంది.
ఐఐటీహెచ్‌లో 4,800 గదుల్లో రేడియంట్ కూలింగ్
ఐఐటీహెచ్‌లోని హాస్టళ్లు, మెస్‌లు కలిపి 4,800 గదుల్లో ఈ స్మార్ట్ కూలింగ్ టెక్నాలజీని ప్రస్తుతం వినియోగిస్తున్నారు. దీంతో హాస్టల్‌లోని విద్యార్థులకు స్వచ్ఛమైన గాలితోపాటు చల్లదనాన్ని అందిస్తున్నారు. ఏసీలతో పోలిస్తే ఈ కూలింగ్ బాగుందని విద్యార్థులు చెబుతున్నారు. అయితే, గోడలు చల్లబడితే పగుళ్లు వస్తాయనే అనుమానాలకు తావులేదని ఐఐటీహెచ్ అధికారులు స్పష్టం చేశారు. ఈ సిస్టమ్‌లో వాడే పీఈఎక్స్ పైపులు పూర్తిగా కాంక్రీట్‌తో కలిసి ఉండడంతో తేమ, తుప్పు, వాతావరణ ప్రభావం వంటి సమస్యలు ఉండవన్నారు. తాము ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ 35-40 సంవత్సరాల వరకు పని చేస్తుందని తెలిపారు. అలాగే, ఈ రేడియంట్ కూలింగ్ సిస్టమ్‌ను రూమ్, ఫ్లోర్, బ్లాక్‌ల వారీగా నియంత్రణ చేసుకోవచ్చని వివరించారు. నిపుణుల ఆధ్వర్యంలో వ్యవస్థను ఆపరేట్ చేయిస్తూ అవసరాలకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను సర్దుబాటు చేసుకుంటున్నామని వెల్లడించారు.