మహిళల జీవించే హక్కును లాగేసుకుంటున్నారు
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:04 AM
దేశవ్యాప్తంగా... ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనుస్మృతిని అనుసరించే శక్తులు మహిళల జీవించే హక్కును లాక్కుంటున్నాయని అఖిల భారత ప్రజాస్వామిక మహిళా సంఘం...
దేశంలో మనువాద భావజాల వ్యాప్తి .. భావితరాల కోసం మహిళలు పోరాడాలి
ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె.శ్రీమతి
12న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటాం
ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి కనినిక ఘోష్
హైదరాబాద్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా... ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనుస్మృతిని అనుసరించే శక్తులు మహిళల జీవించే హక్కును లాక్కుంటున్నాయని అఖిల భారత ప్రజాస్వామిక మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు పి.కె.శ్రీమతి టీచర్ అన్నారు. దేశంలో వేగంగా మనువాద భావజాల వ్యాప్తి విస్తరణ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భావితరాలకు మెరుగైన జీవితం కోసం నేటి మహిళలు పోరాట మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఐద్వా 14వ జాతీయ మహాసభలో ఆమె జాతీయ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఐద్వా ప్రతినిధులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మన పూర్వీకులు చేసిన పోరాటాల ఫలితంగానే మనం గతంలో కంటే కొంత మెరుగైన జీవితం గడుపుతున్నామని చెప్పారు. అనేక రంగాల్లో అభివృద్ధి సూచికల్లో భారతదేశం చాలా వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై దాడులు పెరగడంతో పాటు అణచివేత తీవ్రమవుతోందని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కనినిక ఘోష్ బోస్ అన్నారు. అణగారిన వర్గాల మహిళలే మైక్రోఫైనాన్స్ వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. బ్యాంకులు పేద మహిళలకు రుణాలు ఇవ్వకుండా బీజేపీ విధానాలు ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకురావడాన్ని, నరేగా చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్పొరేట్ మీడియాను ఆర్‌ఎ్‌సఎస్ నియంత్రిస్తోందని, ప్రభుత్వరంగ సంస్థల్లో ఆర్‌ఎ్‌సఎస్ భావజాలం ఉన్నవారిని చొప్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహాసభల్లో ఐద్వా నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.